
పంచాయితీ కోసం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన మహిళతో ఎఫైర్.. భక్షకుడిగా మారిన రక్షకుడు..
web desc : ఖాకీపై ఓ కుటుంబం పెట్టుకున్న నమ్మకం వమ్ము అయింది. అదే ఖాకీ చేతిలో ఆ కుటుంబం బలైపోయింది. కూతురు పంచాయితీ కోసం పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన దంపతులకు ఓ కానిస్టేబుల్ అప్పు ఇచ్చాడు. ఆ తర్వాత ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
పెళ్లి నిశ్చయం కావడంతో వివాహేతర సంబంధం బయటపడుతుందన్న భయంతో దంపతులనే అడ్డు తొలగించుకున్నాడు. ఆపై రోజు వారి విధులకు హాజరై పోలీస్ బృందాలతో ఘటన స్థలాన్ని కూడా సందర్శించాడు. నేరం ఎంత పక్కాగా ప్లాన్ చేసినా.. ఏదో ఒక ఆధారం నిందితులను పట్టిస్తుంది. సీసీ కెమెరాలు, కాల్‌డేటా చివరకు ఖాకీ కిరాతకాన్ని బయటపెట్టాయి.
ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. సూర్యాపేట జిల్లా మోతె మండలం బీక్యా తండాకు చెందిన నాగు, బూబా దంపతులు మోతెలో భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ దంపతులు ఇద్దరు కుమార్తెల పెళ్లిళ్లు కూడా చేశారు.
అయితే ఓ కూతురికి సంబంధించిన పంచాయితీ విషయంలో దంపతులు మోతే పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అక్కడ కానిస్టేబుల్ షరీఫ్‌తో బూబాకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో కానిస్టేబుల్ షరీఫ్ నుండి బూబా దంపతులు రూ.3 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ఇటీవల షరీఫ్‌కు వివాహం నిశ్చయం కావడంతో అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి చెల్లించాలని బూబాపై ఒత్తిడి తెచ్చాడు.
అయితే అప్పు చెల్లించకుండా తమ మధ్య ఉన్న వివాహేతర సంబంధాన్ని బయటపెడతానంటూ బూబా బెదిరించింది. పక్కా ప్లాన్‌తో.. దీంతో నాగు, బూబా దంపతులను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని షరీఫ్ పథకం వేశాడు. ఒకసారి అమలు చేసిన పథకం ఫెయిల్ అయింది. ఈసారి తనకు సహయంగా పోలీస్ స్టేషన్ లో హెల్పర్ గా పనిచేసే సుందరయ్యతో కలిసి పకడ్బందీగా అమలు చేయాలని షరీఫ్ ప్లాన్ చేశాడు.
ఈనెల 11వ తేదీ రాత్రి నాగును తీసుకువచ్చి నిందితులిద్దరూ కర్రతో కొట్టి హత్య చేశారు. ఆ తర్వాత సుందరయ్య.. ఇంటి వద్ద ఉన్న బూబాను బైక్ పై తీసుకువచ్చాడు. భర్త కనిపించకపోవడంతో కేకలు వేసింది. దీంతో వెంటనే షరీఫ్ కర్రతో బూబాను కొట్టి హత్య చేశాడు. ఆ తర్వాత దంపతుల మృత దేహాలను భూమిలో పూడ్చిపెట్టారు. భూమిలో పోటీ చేసిన మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే మోతే పోలీసులు, జిల్లా ఎస్పీ నరసింహ ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆ సమయంలో కానిస్టేబుల్ షరీఫ్ రోజువారి విధుల్లో పాల్గొని, ఏమీ తెలియనట్లు ఘటన స్థలాన్ని కూడా పరిశీలించారు. కానీ.. నేరం చేసిన వాళ్లు ఆధారాలు చెరిపేశామని భావించినా.. పోలీసుల దర్యాప్తులో ఒక్కో లింక్ బయటపడింది. సీసీ కెమెరాలు.. కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు సుందరయ్యను అదుపు తీసుకుని విచారించారు.
దీంతో ఖాకీ కిరాతకం బట్టబయలు అయింది. దంపతుల హత్యకు ప్రధానంగా ఆర్థిక లావాదేవీలు, వివాహేతర సంబంధాల నేపథ్యంలో ఏర్పడిన వివాదమే కారణమని ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారణకు వచ్చినట్లు పోలీసులు తేల్చారు.
ఇక నిందితుడు షరీఫ్ మోతె పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తుండగా, అతడి ప్రొబేషనరీ పీరియడ్ ఇంకా పూర్తికాలేదని జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. నిందితులిద్దరిని అరెస్టు చేసామని ఆయన చెప్పారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి వుంది.




