
అరెస్ట్ చేసే వరకు విధులకు రాం.. పంచాయతీ కార్యదర్శుల సంచలన నిర్ణయం
పెద్దేముల్: మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శిపై దాడికి పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోకపోతే మండలంలోని గ్రామ పంచాయతీ కార్యదర్శులంతా మూకుమ్మడిగా విధులను బహిష్కరిస్తామని తెలంగాణ రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల సంఘం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కోఆర్డినేటర్ లాలప ఆధ్వర్యంలో ఎంపీడీఓకు వినతిపత్రం సమర్పించారు.
ప్రభుత్వ కార్యాలయంలో అధికారుల సమక్షంలోనే తోటి ఉద్యోగిపై దాడి జరగడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులు, తోటి సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం (ఆగస్టు 14) సాయంత్రం 6 గంటల సమయంలో పెద్దేముల్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ, ఎంపీఓ సమక్షంలో కందనెల్లి తండా పంచాయతీ కార్యదర్శిని ఓ వ్యక్తి తిడుతుండగా, అక్కడే ఉన్న జైరాం తండా పంచాయతీ కార్యదర్శి మల్లేష్ జోక్యం చేసుకుని తిట్టుకోవడం ఎందుకని, మంచి మాటలతో మాట్లాడుకోవాలని సూచించినట్లు తెలిపారు.
దీంతో సాటి కార్యదర్శికి మద్దతుగా నిలిచారనే కారణంతో జైరాం తండా పంచాయతీ కార్యదర్శి మల్లేష్‌పై కుండానెల్లి తండా సర్పంచ్, ఆయన కుమారుడు దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనతో కార్యాలయంలోని సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారని పంచాయతీ కార్యదర్శులు తెలిపారు. గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ సిబ్బందిపై ఇలా దాడులు చేయడం సరికాదని అన్నారు. ఉద్యోగుల భద్రతకు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పోలీసులపై కార్యదర్శుల ఆగ్రహం ఘటన అనంతరం బాధిత కార్యదర్శి అదే రోజు రాత్రి 8 గంటల సమయంలో పెద్దేముల్ పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయంలో, ఉన్నతాధికారుల సమక్షంలోనే ఉద్యోగిపై దాడి జరగడం తమ భద్రతపై ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు.
దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు మండలంలోని 37 గ్రామపంచాయతీల్లో విధులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శులు విధులకు హాజరుకాబోమని, అవసరమైతే మూకుమ్మడిగా విధులను బహిష్కరిస్తామని ఎంపీడీఓకు సమర్పించిన వినతిపత్రంలో స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, పోలీస్ స్టేషన్‌లో గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులు వేర్వేరుగా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నట్లు తెలుస్తోంది.




