
నకిలీ ఏజెన్సీ సర్టిఫికెట్లతో ప్రభుత్వ ఉద్యోగం..?
నకిలీ విద్యార్హత సర్టిఫికెట్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు
విచారణకు ఆదేశాలిచ్చినా.. జాప్యంపై ఫిర్యాదుదారుడి అసంతృప్తి
గిరిజన గురుకుల ఉపాధ్యాయురాలిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్
సి కె న్యూస్ గూడూరు ప్రతినిది
మహబూబాబాద్ జిల్లా గూడూరు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం లో గతంలో పనిచేసి, ప్రస్తుతం దామరవంచ గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న బాధితురాలిపై నకిలీ ఏజెన్సీ సర్టిఫికెట్, హిందీ పండిట్ శిక్షణ ధ్రువపత్రం సమర్పించారనే ఆరోపణలు ఉన్నాయని, వాటిపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను నిగ్గు తేల్చాలని ఎన్టీవీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బానోత్ రామన్న నాయక్ డిమాండ్ చేశారు.
ఈ వ్యవహారంపై గతంలో తాను సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినట్లు రామన్న నాయక్ తెలిపారు. తన ఫిర్యాదుపై అధికారులు విచారణకు ఆదేశించిన విషయాన్ని సంబంధిత అధికారిక ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
జూలై 27, 2026న జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం నుంచి జారీ అయిన లేఖలో,సదరు ఉపాధ్యాయురాలు 2009లో కేజీబీవీ గూడూరులో సి ఆర్ టీ (హిందీ)గా నియమితులైనట్లు పేర్కొంటూ, ఆమె సమర్పించినట్లు ఆరోపణలు ఉన్న ఏజెన్సీ సర్టిఫికెట్‌పై సమగ్ర విచారణ చేపట్టాలని ఐ టి డి ఏ ఏటూరునాగారం ప్రాజెక్ట్ అధికారిని కోరారు. విచారణ అనంతరం నివేదికను ఫిర్యాదుదారుడికి అందజేయడంతో పాటు సంబంధిత కార్యాలయానికి కూడా పంపాలని సూచించారు.
అదేవిధంగా గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం నుంచి ఆగస్టు 2026లో జారీ చేసిన ఉత్తర్వుల్లోనూ బాధితురాలుకు సంబంధించిన ఏజెన్సీ సర్టిఫికెట్, హిందీ పండిట్ ట్రైనింగ్ సర్టిఫికెట్ అసలుదనంపై విచారణ జరిపి వాస్తవ నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
విచారణలో భాగంగా ఏజెన్సీ సర్టిఫికెట్ అసలుదనం, హిందీ పండిట్ ట్రైనింగ్ సర్టిఫికెట్ చెల్లుబాటు, సర్టిఫికెట్లను జారీ చేసిన సంస్థలు లేదా అధికారుల వివరాలు, నియామక ప్రక్రియ, విద్యార్హతలు, సర్వీస్ రికార్డులు తదితర అంశాలను పరిశీలించాలని అధికారులు స్పష్టంగా సూచించారు.
అయితే విచారణకు ఆదేశాలు జారీ అయినప్పటికీ ఇప్పటివరకు పూర్తి స్థాయి వాస్తవ నివేదిక వెల్లడించకపోవడంపై ఫిర్యాదుదారుడు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత సర్టిఫికెట్లు నిజమైనవా? నకిలీవా? అనే విషయాన్ని వాటిని జారీ చేసిన సంస్థలు, సంబంధిత అధికారుల ద్వారా అధికారికంగా ధృవీకరించాలని ఆయన కోరుతున్నారు.
విచారణలో సర్టిఫికెట్లు నకిలీవని తేలితే సంబంధిత ఉద్యోగిపై నిబంధనల ప్రకారం శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రామన్న నాయక్ డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వానికి నష్టం జరిగినట్లు తేలితే బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ వ్యవహారంపై ఎలాంటి పక్షపాతం లేకుండా పారదర్శకంగా సమగ్ర విచారణ నిర్వహించి, వాస్తవాలను ప్రజల ముందుంచడంతో పాటు విచారణ తుది నివేదికను ఫిర్యాదుదారుడికి అందజేయాలని రామన్న నాయక్ కోరారు.




