
స్వాతంత్ర్య వేడుకల్లో పచ్చదనం పరిమళం
గార్లఓడ్డు మొక్కలు నాటిన సర్పంచ్, దేవస్థాన నిర్వాహకులు
సీకే న్యూస్ ఖమ్మం ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఆగస్టు 16 2026: గార్లఒడ్డు గ్రామంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ భూక్య నర్సిలాలు నాయక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వద్ద కూడా దేవస్థాన నిర్వాహకుల ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేవస్థానం ప్రాంగణంలో సర్పంచ్ భూక్య నర్సిలాలు నాయక్, దేవస్థాన నిర్వాహకులు కలిసి వివిధ రకాల మొక్కలను నాటారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం అనేక మంది స్వాతంత్ర్య సమరయోధులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం ప్రాముఖ్యతను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.
దేశభక్తి, ఐక్యత, క్రమశిక్షణతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రతి ఒక్కరూ ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యతను కూడా తీసుకోవాలని సూచించారు. పచ్చదనం పెంపొందించడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని తెలిపారు.
దేవస్థానం పరిసరాలను పరిశుభ్రంగా, పచ్చదనంతో తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. గ్రామ ప్రజలు, యువత మొక్కల సంరక్షణలో భాగస్వాములు కావాలని సర్పంచ్ పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో గ్రామ పెద్దలు, స్థానికులు, దేవస్థాన నిర్వాహకులు, సిబ్బంది, యువకులు తదితరులు పాల్గొన్నారు.




