
ఎస్ఐ కాళ్లపై పడ్డ రైతన్న.. వీడియో వైరల్
కాంగ్రెస్ సర్కార్ హయాంలో రైతుల సాగునీటి కష్టాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఓ వైపు ఆలస్యంగా కురిసిన వర్షాలు.. మరోవైపు చాలీ చాలని సాగునీటితో రైతన్న పడుతున్న ఇబ్బందులు ఎలా ఉన్నాయో తెలిపే వీడియో ఇది. రైతులు యూరియా కోసం, సాగు నీటి కోసం అధికారుల కాళ్లు పట్టుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి.
తాజాగా ఓ రైతు నీళ్ల కోసం ఎస్సై కాళ్లు పట్టుకున్నారు. ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్ నుంచి సాగునీరు విడుదల చేయాలని ఐబీ కార్యాలయం ముందు రైతులు నిరసన బాట పట్టారు. రిజర్వాయర్లో 17 అడుగుల నీరు ఉన్నప్పటికీ ఈ సర్కార్ సాగు నీరు విడుదల చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆందోళనలో పాల్గొన్న రైతులను పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఓ అన్నదాత తమ నిరసనను అడ్డుకోవడానికి వచ్చిన ఎస్సై కాళ్లపై పడి నీటిని విడుదల చేయించాలని వేడుకున్నారు. రాష్ట్రంలో రైతన్నల పరిస్థితి ఎలా ఉందో చెప్పే ఈ దృశ్యం రైతుల పట్ల రేవంత్ సర్కార్ నిర్లక్ష్యవైఖరి కండ్లకు కట్టినట్టు చూపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.




