
కాపాడాల్సిన సర్పంచే ఇబ్బందులు పెడితే కాపాడేది ఎవరు..?
గ్రామ ప్రథమ పౌరుడే సర్పంచ్ ఇబ్బందులు పెడితే మేము ఎవరికి చెప్పుకోవాలి
పాలకుర్తి,సి కే న్యూస్ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి తెచ్చుకున్న ఇసుక సీజ్ చేయించారని గ్రామస్తుల ఆవేదన
తొర్రూరు మండలం కర్కార గ్రామంలో గ్రామ సర్పంచ్ తీరుపై కొందరు గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నాలుగేళ్లుగా ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లను నిర్మించుకునేందుకు ఇసుకను దశలవారీగా తెచ్చుకుని ఇళ్ల ముందు నిల్వ చేసుకుంటున్నామని, అయితే ఆ ఇసుకను గ్రామ సర్పంచ్ అధికారులకు సమాచారం అందించి సీజ్ చేయించారని వారు ఆరోపిస్తున్నారు.
గ్రామంలో సుమారు 18 మంది ట్రాక్టర్ యజమానుల వద్ద ఒక్కో ట్రాక్టర్‌కు రూ.5 వేల చొప్పున డబ్బులు తీసుకుని, గ్రామస్తులకు అవసరమైనంత ఇసుకను తరలించుకోవచ్చని, తమకు అనుమతి ఉందని చెప్పినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో తాము డబ్బులు చెల్లించి ఇసుకను తెప్పించుకున్నామని, అనంతరం అదే ఇసుకను అధికారులకు సమాచారం ఇచ్చి సీజ్ చేయించడంతో తీవ్రంగా నష్టపోయామని వారు వాపోతున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం తెచ్చుకున్న ఇసుక విషయంలోనే పేద ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుంటే, మరోవైపు ఇసుక విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులతో పేదలు ఇళ్ల నిర్మాణాలను కొనసాగించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వ్యవహారంపై సంబంధిత ప్రభుత్వ అధికారులు సమగ్రంగా విచారణ చేపట్టి, వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇళ్ల నిర్మాణం కోసం ఇసుక తెచ్చుకునే పేద ప్రజలకు అనవసర ఇబ్బందులు కలగకుండా స్పష్టమైన నిబంధనలు అమలు చేయాలని, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.పేదల ఇళ్ల నిర్మాణానికి ఇసుక అడ్డంకిగా మారకుండా అధికారులు వెంటనే స్పందించాలని కర్కార గ్రామస్తులు కోరుతున్నారు.




