
హైదరాబాద్‌లో నడిరోడ్డుపై రౌడీషీటర్ హ*త్య..
హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రౌడీషీటర్‌ను బుధవారం తెల్లవారుజామున అతి కిరాతకంగా హ*త్య చేశారు.ఈ ఘటనతో మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
నడిరోడ్డుపై నెత్తుటి మరకలు చూసి స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. మృతిచెందిన రౌడీషీటర్ పేరు మహమ్మద్ ఖాజీ సోహెల్‌గా పోలీసులు గుర్తించారు. పల్లెచెరువు సమీపంలోని హయత్ హోటల్ నుంచి దుర్గానగర్ రోడ్డువైపు వెళ్లే మార్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. అలీనగర్‌కు చెందిన మహమ్మద్ ఖాజీ సోహెల్ (25) బుచ్చర్గా పనిచేస్తున్నాడు. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్లో అతనిపై రౌడీషీట్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బుధవారం తెల్లవారుజామున 2:40 గంటల సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సోహెల్‌పై సుభాన్ కలానీ ఫేజ్ – 2లో కత్తితో దాడి చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. సోహెల్ కడుపు, ఛాతీ వెనుక భాగంలో కత్తిపోట్లు తగలడంతో తీవ్రంగా గాయపడిన సోహెల్ అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.
హత్య గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని హత్య జరిగిన తీరును పరిశీలించారు. హత్యకు దారితీసిన కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ హత్య ఎవరు చేశారు అనే దాని కోసం దగ్గరలోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు సోహెల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌కు తరలించారు.
అయితే, ఈ హత్య వెనుక ఉన్న కోణంపై పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. పాత కక్షలా? లేక మరేదైనా వివాదమా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. నిందితులు ఎవరని గుర్తించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని.. త్వరలోనే నిందితులు గుర్తించి పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.




