
ఏన్కూరులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి
ఎనిమిది మందిపై కేసు నమోదు.. రూ.7,290 నగదు,
ఆరు ద్విచక్ర వాహనాలు, ఏడు సెల్‌ఫోన్లు స్వాధీనం
సీకే న్యూస్ ఖమ్మం ప్రతినిధి ఇస్లావత్ నరసింహ
ఏన్కూరు సెప్టెంబర్ 13 2026: కల్లూరు సబ్ డివిజన్ పరిధిలోని ఏన్కూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో గార్లఒడ్డు గ్రామ శివారులో పేకాట స్థావరంపై పోలీసులు దాడి నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు చేపట్టిన ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు.
పేకాట స్థావరం వద్ద వారి వద్ద నుంచి రూ.7,290 నగదు, ఆరు ద్విచక్ర వాహనాలు, ఏడు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా పేకాట నిర్వహిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు ఘటనకు సంబంధించి ఎనిమిది మందిపై కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు చేపట్టారు.
ఈ వివరాలను కల్లూరు సబ్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వసుంధర యాదవ్ ఐపీఎస్ వెల్లడించారు. సబ్ డివిజన్ పరిధిలో అక్రమ పేకాట, జూద కార్యకలాపాలపై నిఘా కొనసాగుతుందని ఆమె తెలిపారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రజలు పేకాట, జూదాలకు దూరంగా ఉండాలని, ఇలాంటి కార్యకలాపాల సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని ఏసీపీ సూచించారు.




