KhammamPoliticalTelangana

ఖమ్మంలో మానవ అక్రమ రవాణా భగ్నం

ఖమ్మంలో మానవ అక్రమ రవాణా భగ్నం

ఖమ్మంలో మానవ అక్రమ రవాణా భగ్నం

నేపాల్‌ నుంచి రైలు లో 14 ఏళ్ల బాలికను అక్రమంగా తరలిస్తుండగా పట్టివేత

ఇద్దరు మహిళలపై మానవ అక్రమ రవాణా కేసు..

కలెక్టర్‌ సమక్షంలో కుటుంబానికి అప్పగింత

సీకే న్యూస్‌ ఖమ్మం ప్రతినిధి ఇస్లావత్‌ నరసింహ ఖమ్మం సెప్టెంబర్‌ 22 2026: నేపాల్‌ నుంచి అక్రమంగా భారత్‌కు తీసుకొచ్చి రైలులో కేరళకు తరలిస్తున్న 14 ఏళ్ల బాలికను ఖమ్మం జిల్లాలో అధికారులు, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో రక్షించారు. బాలికను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు మహిళలను కూడా అదుపులోకి తీసుకుని, వారిపై ప్రభుత్వ రైల్వే పోలీసులు మానవ అక్రమ రవాణా చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

వివరాల్లోకి వెళితే.. ఈ నెల 11న అసోసియేషన్‌ ఫర్‌ వాలంటరీ యాక్షన్‌ (ఏ వి ఏ), ఢిల్లీ నుంచి వచ్చిన సమాచారంతో నేపాల్‌కు చెందిన 14 ఏళ్ల మైనర్‌ బాలికను ఇద్దరు మహిళలు అక్రమంగా భారత్‌కు తీసుకొచ్చి రప్తిసాగర్‌ ఎక్స్‌ప్రెస్‌లో కేరళలోని కొల్లం వైపు తీసుకెళ్తున్నట్లు స్థానిక ఏఐడీ సంస్థకు సమాచారం అందింది. వెంటనే ఏఐడీ ప్రతినిధులు మహిళా, శిశు సంక్షేమ శాఖతో పాటు జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారులకు సమాచారం అందించారు.

అధికారులు తక్షణమే స్పందించి రైల్వే చైల్డ్‌ హెల్ప్‌డెస్క్‌, జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్‌ సిబ్బందికి సమాచారం అందించారు. అన్ని విభాగాల సమన్వయంతో బాలికను, ఆమెతో ఉన్న ఇద్దరు మహిళలను రక్షించారు. అనంతరం బాలికను చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ ఖమ్మం ఎదుట హాజరుపరచగా, కమిటీ ఆదేశాల మేరకు బాలల సదనంలో సంరక్షణలో ఉంచారు.

కుటుంబ నేపథ్యంపై విచారణ

బాలిక కుటుంబ పరిస్థితులు, నేపథ్య వివరాలను సమర్పించాలని చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ ఆదేశించింది. దీంతో నేపాల్‌కు చెందిన మైటీ నేపాల్‌ స్వచ్ఛంద సంస్థ బాలిక కుటుంబ నేపథ్యంపై వివరాలను సేకరించి నివేదిక అందించింది. బాలిక తల్లిదండ్రులు ఇద్దరూ దృష్టిలోపం ఉన్నవారు కావడంతో ఖమ్మం రావడం సాధ్యం కాలేదు.

నేపాల్‌ ఎంబసీ అనుమతితో మైటీ నేపాల్‌ సంస్థ ప్రతినిధి ఈ నెల 21న ఖమ్మం చేరుకుని చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ ఎదుట హాజరై బాలికకు సంబంధించిన ఆధారాలు, పత్రాలను సమర్పించారు. వాటిని పరిశీలించిన అనంతరం కమిటీ బాలికను కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రక్రియను పూర్తి చేసింది.

రూ.20 వేల ఆర్థిక సాయం

మానవ అక్రమ రవాణాకు గురైన బాధితులకు అందించే రూ.20 వేల ఆర్థిక సహాయాన్ని జిల్లా కలెక్టర్‌ దివాకర్‌ టీఎస్‌ బాలికకు అందజేశారు. ఈ మొత్తాన్ని బాలిక పునరావాసానికి, కుటుంబంతో తిరిగి మమేకం కావడానికి వినియోగించాలని సూచించారు. బాలికను కుటుంబ సభ్యులు చక్కగా సంరక్షిస్తూ భవిష్యత్తులో ప్రయోజకురాలిగా తీర్చిదిద్దాలని కలెక్టర్‌ సూచించారు.
బాలికను అప్పగించే ప్రక్రియ మొత్తాన్ని జిల్లా బాలల పరిరక్షణ అధికారిణి విష్ణువందన సమన్వయం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి ప్రమీల, జిల్లా బాలల పరిరక్షణ అధికారిణి విష్ణువందన, చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ సభ్యులు లింగయ్య, లక్ష్మణ్‌, ఏఐడీ సంస్థ డైరెక్టర్‌ పీఎస్‌ఎస్‌ హరి ప్రసాదరావు, మైటీ నేపాల్‌ సంస్థ ప్రతినిధి మహేశ్వరి, బాలల సదనం సూపరింటెండెంట్‌ నవ్య, లీగల్‌ ప్రొబేషనరీ ఆఫీసర్‌ శ్రీలక్ష్మి, ఏఐడీ జిల్లా కోఆర్డినేటర్లు కే. శ్రీనివాస్‌, రాజేష్‌, అసోసియేషన్‌ ఫర్‌ వాలంటరీ యాక్షన్‌ కోఆర్డినేటర్‌ శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button