
తహసీల్దార్ కార్యాలయంలోనే తండ్రీకొడుకుల ఆత్మ*హత్యాయత్నం..
Web desc : భూ వివాదం, బోర్ల సీజ్ వ్యవహారం ఓ రైతు కుటుంబంలో తీవ్ర ఆందోళనకు దారితీసింది. తమ వ్యవసాయ బోర్లను సీజ్ చేయాలన్న అధికారుల ఆదేశాలతో మనస్తాపానికి గురైన ఓ రైతు తన కుమారుడితో కలిసి తహసీల్దార్ కార్యాలయంలోనే క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన బుధవారం దుగ్గొండి మండలంలో చోటుచేసుకుంది. ప్రస్తుతం తండ్రీకొడుకులు వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
బోర్ల సీజ్ వ్యవహారంతో వివాదం…
వివరాల్లోకి వెళ్తే.. దుగ్గొండి మండలంలోని తిమ్మంపేట శివారులో తోట్ల బాబు, తోట్ల రాములు అనే అన్నదమ్ములకు వ్యవసాయ భూములు ఉన్నాయి. ఈ భూముల్లో వారిద్దరూ వేర్వేరుగా బోర్లు వేయించుకున్నారు. కాగా, పక్కనే ఉన్న బైరి సంతోష్‌రెడ్డి తండ్రి మనీష్‌రెడ్డి సుమారు ఎనిమిదేళ్ల క్రితం తన వ్యవసాయ భూమిలో బోరు వేయించుకున్నారు.
అయితే, అన్నదమ్ములు కొత్తగా బోర్లు వేయించుకోవడంపై సంతోష్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో రెవెన్యూ అధికారుల ద్వారా వారి బోర్లను సీజ్ చేయించేందుకు ప్రయత్నాలు జరిగినట్లు తెలుస్తోంది. తహసీల్దార్ కార్యాలయంలోనే ఆత్మహత్యాయత్నం…
గతంలో దుగ్గొండి తహసీల్దార్ ఆదేశాలతో బోరును తెరిపించి వినియోగించుకుంటున్నప్పటికీ, ఇటీవల మరోసారి బోరును సీజ్ చేయాలని అధికారులు ఆదేశించడంతో బాబు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం.
ఈ క్రమంలో బుధవారం తన కుమారుడు అన్వేష్‌తో కలిసి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాడు. అధికారులతో మాట్లాడుతున్న సమయంలోనే తండ్రీకొడుకులు కార్యాలయంలో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
ఎంజీఎంలో చికిత్స…
ఈ ఘటనతో అప్రమత్తమైన తహసీల్దార్ వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అంబులెన్స్‌లో తండ్రీకొడుకులను వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం ఇద్దరూ అక్కడ చికిత్స పొందుతున్నారు. బోర్ల సీజ్ వివాదం నేపథ్యంలో తండ్రీకొడుకులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై వివరణ కోసం దుగ్గొండి తహసీల్దార్‌ను ఫోన్‌లో సంప్రదించగా స్పందించలేదు.




