Khammam
Trending

బస్సుల కోసం విద్యార్థుల పోరుబాట

బస్సుల కోసం విద్యార్థుల పోరుబాట

బస్సుల కోసం విద్యార్థుల పోరుబాట

సమయపాలన లేని ఆర్టీసీ సర్వీసులతో చదువులకు ఆటంకం

అదనపు బస్సులు నడపాలని ఏఐఎస్ఎఫ్ ఆందోళన

ఏన్కూర్ ఎమ్మార్వో కార్యాలయం ముట్టడి.. అధికారులకు వినతి

సీకే న్యూస్‌ ఖమ్మం ప్రతినిధి ఇస్లావత్ నరసింహ నవంబర్ 12 2026: విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ఆర్టీసీ బస్సు సర్వీసుల సమయాలను మార్చడంతో పాటు అదనపు బస్సులను ఏర్పాటు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బూర మనోజ్ డిమాండ్ చేశారు. గురువారం ఏఐఎస్ఎఫ్ ఏన్కూర్ మండల సమితి ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ప్రదర్శన నిర్వహించి, స్థానిక ఎమ్మార్వో కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా చేపట్టారు. అనంతరం ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బూర మనోజ్ మాట్లాడుతూ.. కళాశాలల నుంచి విద్యార్థులు బయటకు వచ్చేలోపే ఆర్టీసీ బస్సులు వెళ్లిపోతుండటంతో దూర ప్రాంత గ్రామాలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సరైన సమయానికి బస్సులు అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోందని, దీనివల్ల ఆర్థిక భారంతో పాటు ప్రయాణ ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.
ముఖ్యంగా ఏన్కూర్ మండల కేంద్రం నుంచి వివిధ గ్రామాలకు వెళ్లే విద్యార్థుల సౌకర్యార్థం బస్సు వేళలను పునఃసమీక్షించాలని కోరారు. ఏన్కూర్ నుంచి తిమ్మరావుపేట, ముచ్చర్ల మీదుగా ఖమ్మం వెళ్లే ఆర్టీసీ బస్సు సర్వీసుల సమయాలను విద్యార్థులకు అనుకూలంగా మార్చాలని, సాయంత్రం 4:30 గంటలకు ఏన్కూర్ సెంటర్‌లో బస్సు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అదనపు బస్సు సర్వీసులను కూడా ఏర్పాటు చేయాలని కోరారు.
ఆర్టీసీ అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని, లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ మండల సమితి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు మనోహర్, జిల్లా సహాయ కార్యదర్శి శివ నాయక్, జిల్లా సమితి నాయకులు ధనుష్ కోటి, సాయి వినయ్, నవీన్, విష్ణు, మేఘన, దివ్య, జ్యోతి, భార్గవి, కీర్తన తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button