
అంగన్వాడీ కేంద్రంపై దొంగల దాడి.. సర్పంచ్ గారు స్పందించేది ఎప్పుడు?
మండలపాడు అంగన్వాడీ-2లో దొంగల బీభత్సం.. ఆయిల్, గుడ్లు ధ్వంసం.. బియ్యం చోరీ!
గతంలోనూ చోరీలు.. కొత్త సర్పంచ్ బాధ్యతలు చేపట్టినా భద్రతపై కనిపించని చర్యలు!
పెనుబల్లి: చిన్నారులకు పౌష్టికాహారం అందించాల్సిన అంగన్వాడీ కేంద్రం దొంగలకు లక్ష్యంగా మారింది. పెనుబల్లి మండలం మండలపాడు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం-2లో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి ఆయిల్ ప్యాకెట్లు, గుడ్లను ధ్వంసం చేయడంతో పాటు బియ్యాన్ని దొంగిలించిన ఘటన కలకలం రేపుతోంది. చిన్నారుల కోసం ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహార సరుకులకే రక్షణ లేకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
గతంలోనూ చోరీ.. అయినా మారని పరిస్థితి!
ఈ కేంద్రంలో గతంలో కూడా దొంగతనం జరిగినట్లు సమాచారం. అయినప్పటికీ ఇప్పటివరకు సరైన భద్రతా చర్యలు చేపట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఒకసారి చోరీ జరిగినా మళ్లీ అదే ఘటన పునరావృతం కావడం అధికారుల పర్యవేక్షణ లోపాన్ని ఎత్తిచూపుతోంది.
కొత్త సర్పంచ్ గారు.. గ్రామంలోని అంగన్వాడీకి రక్షణ కల్పించలేరా?
గ్రామ సర్పంచ్‌గా గాయం రమేష్ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో మండలపాడు అంగన్వాడీ కేంద్రం భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన బాధ్యత ఆయనపై కూడా ఉంది. గ్రామంలోని చిన్నారులకు సంబంధించిన కేంద్రంలో వరుసగా చోరీలు జరుగుతున్నా సమస్యకు శాశ్వత పరిష్కారం ఎందుకు చూపడం లేదు? గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ కేంద్రాల భద్రతపై సర్పంచ్ గారు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? గ్రామ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
సర్పంచ్ బాధ్యతలు కేవలం పదవికే పరిమితమా?
గ్రామంలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, ప్రజా సమస్యల పరిష్కారంలో గ్రామ పంచాయతీ పాత్ర కీలకం. అంగన్వాడీ కేంద్రంలో గతంలోనూ చోరీలు జరిగిన నేపథ్యంలో ఇప్పటికైనా సర్పంచ్ గాయం రమేష్ స్పందించి కేంద్రానికి భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఈ కేంద్రంలో టీచర్‌గా మెరిరత్నకుమారి విధులు నిర్వహిస్తుండగా, ఆయా లేకపోవడం గమనార్హం. సూపర్వైజర్గా అనురాధ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అధికారులు, సర్పంచ్ ఇప్పటికైనా మేల్కొంటారా?.. చిన్నారుల కడుపు నింపాల్సిన పౌష్టికాహార సరుకులు దొంగల చేతిలో ధ్వంసమవుతుంటే చూస్తూ ఊరుకుంటారా? చోరీలకు అడ్డుకట్ట వేసి, బాధ్యులను గుర్తించి, అంగన్వాడీ కేంద్రానికి తగిన భద్రత కల్పించడంలో సర్పంచ్‌తో పాటు సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.




