టెన్త్ పరీక్ష పత్రాలలో గందరగోళం...

టెన్త్ పరీక్ష పత్రాలలో గందరగోళం...;

By :  Ck News Tv
Update: 2025-03-22 08:57 GMT

టెన్త్ పరీక్ష పత్రాలలో గందరగోళం...


నల్లగొండ జిల్లాలో పదో తరగతి పరీక్ష పేపర్ లీక్ వార్త కలకలం రేపింది. జిల్లాలోని నకిరేకల్ పట్టణ పరిధిలోని గురుకుల పాఠశాలలో ఈ పేపర్ లీక్ అయినట్టు వార్తలు గుప్పుమన్నాయి.

కడపర్తిరోడ్డులోని బీసీ బాలుర గురుకుల పాఠశాలలోని పరీక్ష కేంద్రంలో ఈ ఘటన జరిగిందని తెలిసింది. దీనికంతటికీ విద్యాశాఖ అధికారులు, పోలీసుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటనకు అవకాశం ఏర్పడిందని తెలుస్తున్నది.

పదో తరగతి పరీక్షలకు తొలిరోజైన నిన్న (మార్చి 21న) తెలుగు పరీక్ష పేపర్ విద్యార్థులకు ఇచ్చిన 10 సెకన్లలోనే సోషల్‌మీడియా వేదికల్లో చక్కర్లు కొట్టిందని వెల్లడైంది.

ఈ పేపర్ లీక్ వ్యవహారంపై విద్యాశాఖ అధికారుల ప్రమేయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిసింది. అయితే ఈ విషయం బయటకు పొక్కకుండా అధికారులు జాగ్రత్తలు పడ్డారు.

ఈ విషయం తెలిసిన ఉన్నతాధికారులు గుట్టుచప్పుడు కాకుండా విచారణ చేపట్టారని తెలిసింది. అసలు ఎగ్జామ్ సెంటర్‌లోకి మొబైల్ ఎలా వెళ్లిందనే విషయంపై వారు ఆరా తీస్తున్నట్టు సమాచారం. పరీక్ష కేంద్రంలో ఉన్న మొబైల్‌లోని వాట్సప్ ద్వారానే ఆ ప్రశ్నపత్రం బయటకు వచ్చిందని తెలుస్తున్నది.

క్షణాల్లో అదే పరీక్ష కేంద్రానికి జీరాక్స్ జవాబుల పత్రాలు అందవేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రైవేటు స్కూళ్లతో విద్యాశాఖ అధికారులు కుమ్మక్కై ఈ తప్పుడు చర్యకు పాల్పడినట్టు ఆరోపణలు వస్తున్నాయి.

ఈ పేపర్ లీక్ వ్యవహారాన్ని సాధారణంగా ముగించేందుకు ఆ అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తున్నది. అయితే పేపర్ లీక్ వార్త ఆ జిల్లాలో పలువురి మొబైళ్లలో చక్కర్లు కొట్టిందన్న సమాచారంపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి మరి.

Similar News