నాకేం తెలియదు.. చావే శరణ్యం అంటున్న డిబార్ అయిన టెన్త్ స్టూడెంట్
నకిరేకల్ లో పదవ తరగతి పరీక్ష పత్రం లీక్ అయిన వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పరీక్షాకేంద్రంలో ప్రశ్నాపత్రం లీక్ అయ్యింది.
గోడ దూకి పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించిన కొంతమంది వ్యక్తులు ప్రశ్నాపత్రాన్ని ఫొటో తీసుకుని వెళ్లారు. ఆపై జవాబులను జిరాక్స్ తీయించి పరీక్ష రాస్తున్న కొందరు విద్యార్థులకు అందించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని పట్టుకున్నారు.
ఈ వ్యవహారంలో విద్యార్థినిని డిబార్ చేయగా.. పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్ మెంటల్ ఆఫీసరును విధుల నుంచి తప్పించారు. అయితే పేపర్ లీక్ ఘటనలో తనకు ఏ పాపం తెలియదని విద్యార్ధిని బల్లెం ఝాన్సీలక్ష్మీ వాపోతుంది. ఎగ్జామ్ సెంటర్ లో కిటికీ పక్కన కూర్చుని పరీక్ష రాస్తుండగా.. ఇద్దరు యువకులు తనను బెదిరించి ఫోటో తీసుకున్నారని చెబుతోంది. ప్రశ్నాపత్రం చూపించకపోతే రాయితో కొడతామని బెదిరించారని వెల్లడించింది. అందుకే ఆ సమయంలో భయం వేసి, ఏం చేయాలో అర్థం కాక క్వశ్చన్ పేపర్ చూపించానని చెప్పింది.
పేపర్ ను ఫొటో తీసుకుని యువకులు అక్కడి నుంచి వెళ్లిపోయారని వివరించింది. పక్కన ఉన్నవారు కూడా ఏం కాదులే చూపించు అన్నారని.. ఇందులో తన ప్రమేయం ఏమిలేదని కన్నీటి పర్యంతం అవుతోంది. దయచేసి తనను పరీక్ష రాసేందుకు అనుమతించాలని.. ఎవరో చేసిన దానికి తనను బలి చేయొద్దంటూ వేడుకుంటుంది. దయచేసి మళ్లీ పరీక్షలు రాసే అవకాశం కల్పించాలని కోరుతుంది. పరీక్షల్లో చూసి రాయాల్సిన అవసరం 5 తనకు లేదని విద్యార్థిని ఝాన్సీలక్ష్మి స్పష్టం చేసింది.
ఎగ్జామ్ రాయనియ్యకపోతే తనకు చావే శరణ్యం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. తమ కూతురుని పరీక్ష రాయనివ్వాలని విద్యార్ధిని తల్లిదండ్రులు సైతం కోరుతున్నారు. కూలీ పనులు చేసుకుంటూ బిడ్డను చదివిస్తున్నామని.. తన భవిష్యత్తును అంధకారం చేయొద్దని వేడుకుంటున్నారు. ఇక ఈ ఘటనలో పోలీసులు 11 మందిపై కేసు నమోదు చేయగా.. ఇప్పటికే ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు సమాచారం.