ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలకు మీనాక్షి మాస్ వార్నింగ్
ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలకు మీనాక్షి మాస్ వార్నింగ్;
ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలకు మీనాక్షి మాస్ వార్నింగ్
పార్టీలో అంతర్గత గొడవలపై ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ సీరియస్ అయ్యారు. ఇకపై ఎవరైనా గొడవ పడినా, పార్టీపై బహిరంగంగా కామెంట్స్ చేసినా ఊరుకునే ప్రసక్తే లేదని నేతలకు వార్నింగ్ ఇచ్చారు.
నియోజకవర్గాల్లో ఇన్‌చార్జిల వల్లే సమస్యలు ఏర్పడితే వారిని తొలగించేందుకు ఒక్క క్షణం కూడా ఆలోచించం అని తీవ్ర హెచ్చరికలు చేశారు. మంగళవారం గాంధీ భవన్‌లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన మెదక్ లోక్‌సభ నియోజకవర్గ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో పార్టీ స్థితిగతులు, ఫలితాలపై సమీక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 14 నెలల ప్రజాపాలనలో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల పై చర్చించారు.
చారిత్రాత్మక నిర్ణయాలైన కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ పైనా అభిప్రాయాలు తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉందని తెలుసుకున్నారు. సంస్థాగతంగా పార్టీ నిర్మాణం, కమిటీల ఏర్పాటుపైనా కీలకంగా చర్చించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహలపై నేతలకు మీనాక్షి దిశానిర్దేశం చేశారు.
పార్టీలో పాత, కొత్త నేతల మధ్య సమన్వయం లోపించకుండా.. ఐక్యంగా ముందుగు సాగాలని హితువు పలికారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్ళాలని సూచించారు. పార్టీ లైన్ దాటితే ఎంతటి వారైనా చర్యలు తప్పవని మరోసారి హెచ్చరించారు.
నియోజక వర్గ ఇన్‌చార్జిలు బాధ్యతాయుతంగా వ్యవహరించి అందరినీ కలుపుకుపోవాలని చెప్పారు. నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.
ఈ సమీక్షలో ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, పోటీ చేసిన అభ్యర్థులు, కాంగ్రెస్ అనుబంధ సంఘాలు చైర్మన్లు, ప్రజా ప్రతినిధులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.