అసెంబ్లీ కి కేసీఆర్.. ఇక సమరమే..

అసెంబ్లీ కి కేసీఆర్.. ఇక సమరమే..;

By :  Ck News Tv
Update: 2025-03-10 09:44 GMT


అసెంబ్లీ కి కేసీఆర్.. ఇక సమరమే..

ఎల్లుండి అసెంబ్లీ సమావేశాలకు రాబోతున్నారట కేసీఆర్. ఈ విషయాన్ని మీడియా చిట్ చాట్‌లో కేటీఆర్ ప్రకటించారు. ఎల్లుండి గవర్నర్ ప్రసంగానికి హాజరవుతారు, తర్వాత కొన్ని కార్యక్రమాలకు కూడా కేసీఆర్ వస్తారని తెలిపారు కేటీఆర్‌.

ముఖ్యమైన బిల్లులపై చర్చ ఉన్నప్పుడు సభకు రాని మాజీ సీఎం.. ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరు కాబోతున్నట్టు తెలిసింది. నిరుడు జులై 23న జరిగిన బడ్జెట్ సమావేశాలకు హాజరైన కేసీఆర్.. అప్పటి నుంచి మళ్లీ అసెంబ్లీ గడప తొక్కలేదు.

కనీసం బడ్జెట్ చర్చల్లోనూ ఆయన పాల్గొనలేదు. కులగణన బిల్లు, ఎస్సీ వర్గీకరణ రిపోర్టుపై డిసెంబర్ 28న జరిగిన చర్చకూ హాజరు కాలేదు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాపంగా డిసెంబర్ 30న నిర్వహించిన అసెంబ్లీ సమావేశాలకు రాలేదు. కీలకమైన అంశాలపై చర్చ సందర్భంగా కూడా ఆయన సభకు హాజరుకాకుండా.. ఫామ్‌ హౌస్‌కే పరిమితమయ్యారు.

అనర్హత వేటు తప్పించుకోవడానికే..

అనర్హత వేటు తప్పించుకోవడానికే ప్రస్తుత బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరు కానున్నట్లు పలువురు నాయకులు చెబుతున్నారు. మామూలుగా అసెంబ్లీ జరిగిన 60 పని రోజుల్లోపు కచ్చితంగా ఒక్కసారైనా సభకు హాజరు కావాలన్న రూల్ ఉంది. లేదంటే అనర్హత వేటు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే సభకు కేసీఆర్‌ తప్పక హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అయితే, బడ్జెట్ సమావేశాల ప్రారంభ రోజు మాత్రమే ఆయన హాజరవుతారా.. లేదంటే సభ జరిగినన్నీ రోజులు ఉంటారా అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశం కాబోతున్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఈ మీటింగ్‌ జరగనుంది.

Similar News