
108 అంబులెన్సులో ప్రసవం.. తల్లీ బిడ్డలు క్షేమం
పురిటి నొప్పులతో ఆసుపత్రికి వెళుతున్న నిండు గర్భిణీకి 108 సిబ్బందే డాక్టర్లుగా మారి సేవలందిస్తూ పురుడు పోశారు. వారు అందించిన సేవలకు తల్లి, బిడ్డలు క్షేమంగా ఉన్నారు. సంఘటన తుంగతుర్తి నియోజకవర్గలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది.
108 అంబులెన్స్ పైలట్ బైరిక నరేష్ తెలిపిన వివరాల ప్రకారం గుండెపురి గ్రామానికి చెందిన గర్భిణి మేడి స్వాతి (22) పురిటి నొప్పులతో బాధపడుతూ 108 కు సమాచారం అందించారు.
ఈ మేరకు 108 సిబ్బంది తమ అంబులెన్స్ లో సూర్యాపేటకు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో నొప్పులు తీవ్రమయ్యాయి. తిరుమలగిరి పరిసరాల్లో అంబులెన్స్ ను ఆపి అందులోనే తోడుగా వచ్చిన గర్భిణీ తల్లి సహాయంతో ఈఎంటీ ఏనుగుతల నరేష్ సుఖ ప్రసవం చేశారు.
ముద్దు ముద్దుగా ఉన్న పసి బిడ్డను కుటుంబ సభ్యులకు అందజేశారు. అంతే కాకుండా క్షేమంగా ఉన్న తల్లీ, బిడ్డలను సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చినట్లు ఆయన తెలిపారు. కాగా 108 సిబ్బంది చూపిన పనితీరు పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.




