KhammamPoliticalTelangana

రైతు కష్టానికి గిట్టుబాటు ఎక్కడ..?

రైతు కష్టానికి గిట్టుబాటు ఎక్కడ..?

రైతు కష్టానికి గిట్టుబాటు ఎక్కడ..?

ఏన్కూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్లక్ష్యం

ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్లక్ష్యంతో నష్టాల్లో రైతాంగం

ప్రారంభోత్సవ హడావుడి తర్వాత కేంద్రాలు నిర్లక్ష్యానికి గురి

CK న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు మే 12 2026: ఏన్కూరుతో పాటు పరిసర ప్రాంతాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట చేతికొచ్చినా సరైన సమయంలో ధాన్యం కొనుగోళ్లు జరగక రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం రైతులకు ఆ ధర అందడం లేదని వాపోతున్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలు సకాలంలో ప్రారంభించినప్పటికీ కొనుగోళ్లు మాత్రం జరగకపోవడంతో రైతులు తమ పంటను రోడ్లపైనే, గోదాముల దగ్గరే నిల్వ ఉంచాల్సి వస్తోంది. రోజులు గడుస్తున్నా అధికారులు, మిల్లర్లు సరైన స్పందన ఇవ్వకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎండలు, అకాల వర్షాలు, గాలిదుమ్ము కారణంగా ధాన్యం తడిసి నాణ్యత కోల్పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మిల్లర్లు, వ్యాపారులు కలిసి రైతులను దోచుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తరుగు పేరుతో ఒక్కో క్వింటాకు 8 నుంచి 10 కిలోల వరకు కోతలు పెడుతున్నారని రైతులు వాపోతున్నారు. తూకాల్లో తేడాలు చూపించడం, తేమ ఎక్కువగా ఉందని చెప్పి ధర తగ్గించడం, నాసిరకం ధాన్యమంటూ అదనపు కోతలు విధించడం వల్ల రైతులకు భారీ నష్టం జరుగుతోందని చెబుతున్నారు.
కొనుగోలు కేంద్రాల్లో సరైన సదుపాయాలు లేక రైతులు రోజులు తరబడి వేచి చూడాల్సి వస్తోంది. గన్నీ సంచులు, తూకం యంత్రాలు, హమాలీలు సరిపడా లేకపోవడంతో లోడింగ్, అన్‌లోడింగ్ పనులు ఆలస్యమవుతున్నాయి. ట్రాక్టర్లు, లారీలు క్యూల్లో నిలిచిపోవడంతో రవాణా ఖర్చులు కూడా రైతులపై అదనపు భారంగా మారుతున్నాయి.
కొనుగోలు చేసిన తర్వాత కూడా రైతులకు డబ్బులు వెంటనే చెల్లించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారాలు గడిచినా బిల్లులు క్లియర్ కాక రైతులు అప్పుల కోసం తిరగాల్సిన పరిస్థితి వస్తోందని చెబుతున్నారు. బ్యాంకు రుణాలు, ప్రైవేట్ అప్పులు, పెట్టుబడి ఖర్చులు తీర్చలేక రైతులు తీవ్ర ఆర్థిక ఒత్తిడికి గురవుతున్నారు.
మండల వ్యవసాయ శాఖ అధికారులు, సివిల్ సప్లై అధికారులు రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రైతులు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడంతో మిల్లర్ల అక్రమాలు కొనసాగుతున్నాయని అంటున్నారు.
ఇదిలా ఉండగా, ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవం రోజున అధికారులు, ప్రజాప్రతినిధుల హడావుడితో సందడి చేసిన కేంద్రాలు… ఆ తర్వాత పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయని రైతులు విమర్శిస్తున్నారు. ప్రారంభం రోజు ఏర్పాటు చేసిన అధికారుల టెంట్లు సైతం ఇప్పుడు పడిపోయి ఉన్నా పట్టించుకునే నాధుడు లేకపోవడం కేంద్రాల దుస్థితికి అద్దం పడుతోందని అంటున్నారు.
“ఓపెనింగ్ రోజు ఫోటోలు, హడావుడి వరకే పరిమితమైన అధికారులు… ఇప్పుడు కేంద్రాల వైపు కన్నెత్తి చూడడం లేదు” అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండగా, పడిపోయిన టెంట్లు కూడా అక్కడి అధికారుల పనితీరుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయని రైతులు ఎద్దేవా చేస్తున్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, మద్దతు ధర పూర్తిస్థాయిలో అమలు చేయాలని, తరుగు దోపిడీని అరికట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే కొనుగోలు కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button