
పర్మినెంట్ టీచర్లు వద్దు..
కాంట్రాక్ట్ పద్ధతిలోనే నియమించాలి..ప్రభుత్వానికి విద్యా కమిషన్ సిఫారసులు
రాష్ట్రంలో ఇక నుంచి ప్రభుత్వ టీచర్లను కాంట్రాక్ట్ పద్ధతిలోనే నియమించాలని, రెగ్యులర్ నియామకాలు చేపట్టకూడదని తెలంగాణ విద్యా కమిషన్ సిఫారసు చేసింది. రెండేండ్లు ప్రొబేషనరీ, ఐదే ండ్లు కాంట్రాక్ట్ పద్ధతిలోనే టీచర్లను తీసుకోవాలని సర్కార్‌కు సూచించింది.
ఆ తర్వాత మళ్లీ టీచర్‌గా కొనసాగాలంటే టీచర్ల పనితీరును మదింపు చేసి, ఐదేండ్లు కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకోవాలని పేర్కొన్నది. ‘మదింపునకు జిల్లా స్కూల్ బోర్డు బాధ్యత వహిస్తుంది. ప్రతి ఐదేండ్లకోసారి టీచర్ల పనితీరును మదింపుచేసి పనితీరు సవ్యంగా లేకపోతే షోకాజ్ నోటీసు ఇవ్వాలి.
పనితీరును మెరుగుపరుచుకునేందుకు రెండేండ్ల వ్యవధినివ్వాలి. ఆ తర్వాత మళ్లీ మూల్యాంకనం చేయాలి. సవ్యంగా ఉంటేనే ఉద్యోగంలో ఉంచాలి. లేదంటే ఉద్యోగం నుంచి తీసేయాలి’ అంటూ కమిషన్ సూచనలు చేసింది. తెలంగాణ విద్యావిధానం (టీఈపీ)పై ప్రభుత్వానికి కమిషన్ నివేదిక సమర్పించింది.
నో ట్రాన్స్ఫర్స్
కొత్తగా టీచర్లను మండలం యూనిట్‌గా నియమించాలని కమిషన్ సూచించింది. రిజర్వేషన్లు పాటించాలని పేర్కొన్నది. ‘ఇక నుంచి టీచర్ల బదిలీలు చేపట్టొద్దు. అనారోగ్య కారణాలతోనూ బదిలీలకు అవకాశం కల్పించొద్దు. కొత్తగా నియమితులైన వారు అదే గ్రామం, లేదంటే.. మండలం లోపల 15 కిలోమీటర్ల రేడియస్‌లో మాత్రమే పనిచేయాలి. అలా పనిచేస్తామని ఒప్పంద పత్రం సమర్పించాలి. ఇతర మండలాల వారు మరో మండలంలో టీచర్‌గా పనిచేయడానికి అనర్హులు.
ఆటోమెటిక్ ఉద్యోగోన్నతులు రద్దు..
కొత్త నియామకాలు చేపట్టే సమయంలో టీచర్ల హోదాలు మార్చాలని కమిషన్ సిఫారసు చేసింది.టీచర్లు, హెచ్ఎంల అటోమెటిక్ ఉద్యోగోన్నతులు నిలిపివేస్తారు. ఒకవేళ ప్రైమరీ టీచర్ హైస్కూల్ టీచర్‌గా ఉద్యోగోన్నతి పొందాలంటే మళ్లీ కొత్త రిక్రూట్మెంట్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇది వరకు పనిచేసిన కాలానికి 10 శాతం వెయిటేజీ అమల్లో ఉంటుంది. రాబోయే పదేండ్ల తర్వాత హెచ్ఎంలను 100 శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో నియమించాలి. 45 ఏండ్ల లోపు ఉంటేనే పోటీ పడే అవకాశం కల్పించాలి. ఒకసారి ఏ స్కూల్‌కు హెచ్ఎంగా వెళ్తే అదే స్కూల్లో పనిచేయాలి. బదిలీ చేయరాదు అని సర్కార్‌కు సూచించింది.
ఉపాధ్యాయుల వేతనాలు ఎక్కువ
రాష్ట్రంలో ఉపాధ్యాయుల వేతనాలు ఎక్కువగా ఉన్నాయి. జీతభత్యాలను హేతుబద్ధీకరించాలి. ఉపాధ్యాయుల వేతనాలను తగ్గించడం ద్వారా మిగిలిన నిధులతో మౌలిక సదుపాయాలు కల్పించాలి’ అని రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా కమిషన్ సూచనలు చేసింది.
మండిపడుతున్న ఉపాధ్యాయులు
విద్యా కమిషన్ చేసిన సూచనలు వివాదాస్పదంగా మారాయి. కమిషన్ తీరుపై టీచర్లు, ఉపాధ్యాయ సంఘాల నేతలు మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా కమిషన్‌ను తూర్పారపడుతున్నారు.
నివేదిక బహిర్గతంపై అభ్యంతరాలు
విద్యా కమిషన్ నివేదికలను బహిర్గతం చేయడంపై తీవ్ర అభ్యంతరాలు వస్తున్నాయి. కొందరైతే దీనిని తొందరపాటు చర్యగా అభివర్ణిస్తున్నారు. ఒక కమిషన్ తన నివేదికలను తామే విడుదల చేయవచ్చా? అన్న వాదనలొస్తున్నాయి. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కమిషన్లను నియమించింది. నివేదికలను స్వీకరించింది. విచారణ సంఘాలు నివేదికలను మాత్రం విడుదల చేయలేదు.
కమిషన్ వ్యాఖ్యలు అనుచితం: పీఆర్టీయూ
విద్యా కమిషన్ నివేదికలో టీచర్లకు వేతనాలెక్కువ అన్న వ్యాఖ్యలుండటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు పీఆర్టీయూ టీఎస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనుచితమని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుల్గం దామోదర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షంగౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు.
ముక్తకంఠంతో ఖండించిన సంఘాలు..
విద్యాకమిషన్ వ్యాఖ్యానాలు, సిఫార్సులను ఉపాధ్యాయ సంఘాలు ముక్తకంఠంతో ఖండించాయి. ప్రభుత్వం ఈ నివేదికను ఉపసంహరించుకోవాలని మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి, ఎస్టీయూ టీఎస్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు భుజంగరావు డిమాండ్ చేశారు. టీచర్ల గౌరవానికి భంగం కలిగించేలా నివేదిక ఉన్నదని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షప్రధాన కార్యదర్శులు వొడ్నాల రాజశేఖర్, తెల్కలపల్లి పెంటయ్య అభిప్రాయపడ్డారు. వేతనాలపై విద్యాకమిషన్ వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని ఎస్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షప్రధాన కార్యదర్శులు సదానందంగౌడ్, జుట్టు గజేందర్ అభ్యంతరం వ్యక్తంచేశారు. ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసేలా నివేదిక ఉన్నదని, ఇది టీచర్ల హక్కులకు గొడ్డలిపెట్టు అని టీఆర్టీఎఫ్ అధ్యక్షుడు కటకం రమేశ్, మారెడ్డి అంజిరెడ్డి అభిప్రాయపడ్డారు. కమిషన్ నివేదికలోని పలు అంశాలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఆర్‌యూపీపీ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు చింతకుంట్ల జగదీశ్, ప్రధాన కార్యదర్శి ములుకనూరి శంకర్ పేర్కొన్నారు. రాధాకృష్ణ (టీపీటీయూ), కరివేద మహిపాల్‌రెడ్డి (ఎస్జీటీ యూ), మణిపాల్‌రెడ్డి (టీటీయూ), గుళ్లపల్లి తిరుమల కాంతికృష్ణ (ఆర్‌యూపీపీటీ), అనిల్‌కుమార్‌రెడ్డి (ఎస్జీటీ ఫోరం) నివేదికను ఖండించాయి.
మరికొన్ని సిఫార్సులు
పాఠశాల అటెండెన్స్ రిజిస్టర్లల్లో ఎస్సీ, ఎస్టీ కులాల ప్రస్తావన ఉండొద్దు. పబ్లిక్‌గా ప్రదర్శించే డాక్యుమెంట్లల్లో ఎక్కడా వివరాలను బహిర్గతం చేయెద్దు..
బడుల్లో జాతీయ నేతల విగ్రహాలు పెట్టవద్దు. అంటే బడుల్లో అంబేద్కర్, గాంధీ, వివేకానంద లాంటి గొప్ప నేతల విగ్రహాలు ఉండొద్దన్న మాట.
జాతీయ, అంతర్జాతీయ ఎన్జీవోలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం పెంచాలి. వీటి సమన్వయానికి, భాగస్వామ్యాలను ప్రోత్సహించేందుకు నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలి.
ప్రతి స్కూల్‌కూ ఎస్టేట్ మేనేజర్, అటెండర్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్లను కాంట్రాక్ట్ పద్ధతిలో అది కూడా స్థానికంగానే నియమించాలి.
రాష్ట్రస్థాయిలో డిప్యుటేషన్లు నిలిపివేయాలి. సెక్టోరల్ ఆఫీసర్లు, కో ఆర్డినేటర్ల వంటి పోస్టులను అర్హత కలిగిన నిపుణులతో భర్తీచేయాలి.
మధ్యాహ్న భోజన పథకం చార్జీలను పెంచారు. రోజుకు రూ. 21 చొప్పున ఇంటర్ విద్యార్థులకు, రూ. 19 చొప్పున 9 , 10వ తరగతి విద్యార్థులకు, రోజుకు రూ.11.79 చొప్పున 6- 8 తరగతులకు, రోజుకు రూ.8.69 చొప్పున 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు చెల్లించాలి.
సిఫార్సులు ఆక్షేపణీయం
టీచర్లకు జీతాలెక్కువున్నాయన్న వ్యాఖ్యలు తీవ్ర ఆక్షేపణీయం. ఇది టీచర్ల గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నది. విద్యా కమిషన్ తన పరిధి కాని అంశాన్ని ప్రస్తావించడం అత్యంత దారుణం. విద్యావ్యవస్థపై అధ్యయనం చేసి, బాగు కోసం సిఫార్సులు చేయాల్సిన కమిషన్ టీచర్ల జీతభత్యాలు ప్రస్తావించడం అత్యంత బాధాకరం. దీనిపై టీచర్ల సంఘాలన్నింటిని కలుపుకొని ఉద్యమిస్తాం.
కృష్ణుడు, బీసీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు.
ప్రతిపాదనలు తిరస్కరించాలి
డీఎడ్ కోర్సును రద్దుచేయాలనడం హాస్యాస్పదం. ప్రాథమిక పాఠశాల టీచర్లకు బీఎడ్, పీజీ ఉండాలనడం అవివే కం. సుప్రీం తీర్పులు, ఎన్సీటీఈ ఉత్తర్వు ల ప్రకారం 1-5 తరగతులకు బోధించేందుకు డీఎడ్ వారే అర్హులు. విద్యాకమిషన్ సిఫారసులను ప్రభుత్వం తిరస్కరించాలి. రద్దు న్యాయపరంగా చెల్లదు.
రావుల రామ్మోహన్‌రెడ్డి,తెలంగాణ డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం
సోషల్ మీడియాలో టీచర్ల అభిప్రాయాలు
హద్దు మీరిన విద్యాకమిషన్ చైర్మన్ తక్షణమే టీచర్లకు క్షమాపణలు చెప్పాలి. సీఎం రేవంత్‌రెడ్డి ఆయన్ను కమిషన్ చైర్మన్ నుంచి తప్పించాలి.
అయ్యా ఆకునూరి గారు.. మా జీతం మీకే ఇస్తాం. మాలెక్క రోజుకు 18 సబ్జెక్టులో బోధించండి. విద్యాప్రమాణాలు పెంచండి.
క్లిష్టమైన కష్టమైన విద్యకు సంబంధించిన విద్యాకమిషన్ నివేదిక బహిర్గతమయ్యింది. కానీ రెండేండ్లు దాటినా పీఆర్సీ నివేదిక మాత్రం బహిర్గతం కావడంలేదు. ఎంటో విడ్డూరం.. ఇలాంటివి ఒక్క తెలంగాణలోనే జరుగుతాయి.
జీతభత్యాలు అనేది పీఆర్సీ కమిటీ నిర్ణయిస్తుంది. ధరల పెరుగుదల.. జీవన ప్రమాణాలపై పెరుగుదల ఆధారపడి ఉంటుంది. అయినా పెంచింది ప్రభుత్వమే కదా? అలాంటప్పుడు ఈ వ్యాఖ్యానాలేంటి?
జీతాల గురించి ప్రస్తావించిన విద్యా కమిషన్ టీచర్లకు రావాల్సిన పెండింగ్ పీఆర్సీ, డీఏ బకాయిలు, రిటైర్మెంట్ ఉద్యోగుల బాధలు, పెన్షనర్ల చావుల గురించి ఎందుకు ప్రస్తావించలేదు.
బడ్జెట్లో పీఆర్సీ ఆడుగకుండా ఉద్యోగుల నోర్లు మూయించే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉన్నది. డీఏలు, పెండింగ్ బిల్లులు, పెన్షనర్ల ఆందోళనను డైవర్ట్‌చేసే దరిద్రపు ఆలోచన ఇది.
అయ్యా సార్లు. దేశంలో టీచర్లకు ఇచ్చే జీతాల్లో తెలంగాణ 11వ స్థానంలో ఉన్నది. మన పక్క రాష్ట్రం ఏపీలో మన టీచర్లకంటే ఎక్కువ జీతాలిస్తున్నారు.
పేనుకు పెత్తనమిస్తే నెత్తినంతా కొరికిందట. మేతావులకు పెత్తనమిస్తే సిఫార్సులు ఇలాగే ఉంటాయి. పనీపాట లేనోడు ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్తాడు?విద్యాకమిషన్ మొదటి నుంచీ ఉపాధ్యాయ వ్యతిరేకి, ఉపాధ్యాయులంటేనే సదభిప్రాయంలేదు. ఇలాంటి వ్యక్తి నుంచి ఇంతకు మించి ఎక్కువ ఆశించలేం.




