
జన సైనికుల వీరంగం…
Social media viral : మద్యం మత్తులో బిహారు కూలీ పై జనసైనికులు దాడికి దిగిన సంఘటన పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం దమ్మాలపాడు గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గ్రామంలో ఆరుకు పైగా మద్యం బెల్ట్‌షాపులు కొనసాగుతున్నాయి. గ్రామానికి చెందిన పూర్ణ అనే మహిళ చిల్లర దుకాణంతో పాటు బెల్ట్‌షాపు నిర్వహిస్తున్నారు. జనసైనికులు శిరిగిరి రాకేష్, శిరిగిరి జయంత్‌లు మద్యం మత్తులో బెల్ట్‌షాపు దుకాణం వద్దకు వచ్చి క్వార్టర్ పై రూ.60 లు ఎక్కువ ఎందుకు అమ్ముతున్నారంటూ నిర్వాహకురాలితో వాదనకు దిగారు. మీకు బెల్ట్ షాపు ఎవరిచ్చారంటూ నిలదీశారు.
మాకు ముప్పాళ్ళ వాళ్ళు ఇచ్చారు…ఏం చేసుకుంటారో చేసుకోండంటూ నిర్వాహకురాలు అనడంతో నిర్వాహకురాలికి, జనసైనికులకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం చోటుచేసుకుంది. దుకాణంలో సీసీ కెమెరాలో రికార్డు కావటాన్ని గమనించిన జనసైనికుల్లోని ఒకరు ముఖానికి ఖర్చీఫ్ కట్టుకొని దుకాణదారురాలితో సీసీ కెమెరా తీసేయ్ అంటూ వాదనకు దిగాడు. గ్రామంలోని రామా లయం నిర్మాణ పనులకు వచ్చిన బిహార్ కు చెందిన కూలీల్లో ఒకరు పూర్ణకు చెందిన దుకాణంలో నిత్యావసర సరుకులు కోసం వెళ్లి జనసైనికులకు, దుకాణం నిర్వాహకురాలి మధ్య జరుగుతున్న వాదనను పక్కన నిలబడి చూస్తున్నాడు. మద్యం మత్తులో ఉన్న జనసైనికుల్లోని ఒకరు నిలబడి ఉన్న కూలీ వివరాలు అడుగుతూ, నీకు ఇక్కడేం పనిరా అంటూ చేయి చేసుకున్నాడు.
పక్కనే ఉన్న మరొకరు తన ప్యాంట్ జేబులో ఉన్న స్టిక్‌ను తీసుకొని కూలీపై విచక్షణా రహితంగా దాడికి దిగారు. పక్కనే ఉన్న వారు వారిస్తున్నా పట్టించుకోకుండా దాడి చేస్తుండటంతో కూలీ పరారయ్యాడు. అనంతరం దుకాణం పైన దాడి చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. సీసీ కెమెరాల్లో నమోదైన ఈ సంఘటన అంతా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ విషయంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు




