
నమ్మించి తీసుకెళ్లి బావిలోకి తోసేశాడు.. 24 గంటల పాటు బావిలోనే నరకం చూసిన మహిళ!
పని ఇప్పిస్తానని నమ్మించి ఓ మహిళను తీసుకుని వచ్చి ఆమె ఒంటి పై ఉన్న బంగారం తీసుకొని ఆమెను బావిలో పడేసి పారిపోయిన ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది.
పోలీసుల కథనం మేరకు.. కరీంనగర్ కిసాన్ నగర్ కు చెందిన గంగాధర లక్ష్మి కూలిగా పని చేస్తుంది. కాగా, బుధవారం ఓ వ్యక్తి పని ఇప్పిస్తానని చెప్పి బుధవారం తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ తీసుకువచ్చాడు.
కాగా ఆమెను ఓ వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లి ఆమె ఒంటి పై ఉన్న బంగారు ఆభరణాలు తీసుకొని ఆమెను బావిలోకి తోసేసి అక్కడి నుంచి పారిపోయాడు.
కాగా లక్ష్మికి ఈత రావడంతో రాత్రి బావిలోనే ఉండి ప్రాణాలతో పోరాడింది. కాగా గురువారం ఉదయం ఆ బావి యజమాని వచ్చి చూడగా బావిలో లక్ష్మీని గుర్తించి పోలీసులకు సమాచారం అందించగా వారు సంఘటనా స్థలికి చేరుకొని ఆమెను మంచం, తాళ్ల సాయంతో బయటకు తీసి చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనకు పాల్పడింది ఎవరు..? అనేది తెలియాల్సి ఉంది. నిందితుని గురించి గాలిస్తున్నట్లు ఎస్ఐ సయ్యద్ అన్వర్ తెలిపారు.




