
నీట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. రిజల్ట్ డేట్ ఫిక్స్.. కౌన్సిలింగ్ నిబంధనలు విడుదల
ప్రశ్నపత్రం లీకేజీ కారణంగా గతంలో రద్దు చేసిన నీట్(NEE Re-Exam Results) పరీక్షను జూన్ 21న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తిరిగి నిర్వహించిన సంగతి తెలిసిందే. విద్యాసంవత్సరం ఆలస్యం కాకుండా ఉండేందుకు, ఈ నెల 20 లోపు ఫలితాలను విడుదల చేయడానికి NTA సన్నాహాలు చేస్తోంది.
ఇప్పటికే జూన్ 25న ప్రొవిజనల్ కీ విడుదల చేసి, జూన్ 28 వరకు అభ్యంతరాలను స్వీకరించింది. దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు హాజరైన ఈ పరీక్ష తుది ఫలితాల ప్రకటనకు కసరత్తు వేగంగా జరుగుతోంది.
కీలకమైన కౌన్సిలింగ్ ప్రక్రియ: 5 దశలు
ఫలితాల అనంతరం దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీ కోసం మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ (MCC) నాలుగు రౌండ్లలో కౌన్సిలింగ్ నిర్వహించనుంది. ఈ ప్రక్రియ 5 ప్రధాన దశల్లో సాగుతుంది.
రిజిస్ట్రేషన్ & ఫీజు చెల్లింపు: అర్హత సాధించిన అభ్యర్థులు MCC అధికారిక వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకుని, కౌన్సిలింగ్ ఫీజుతో పాటు రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్‌ను ఆన్లైన్లో చెల్లించాలి.
వెబ్ ఆప్షన్ల ఎంపిక: విద్యార్థులు తమకు నచ్చిన మెడికల్ కాలేజీలు, కోర్సులను ప్రాధాన్యతా క్రమంలో ఎంచుకోవాలి. ఎక్కువ ఆప్షన్లు ఇస్తే సీటు వచ్చే అవకాశం పెరుగుతుంది.
ఆప్షన్ల లాకింగ్: ఎంచుకున్న కాలేజీల జాబితాను గడువులోగా లాక్ చేయాలి. మర్చిపోతే సిస్టమ్ ఆటోమేటిక్‌గా లాక్ చేస్తుంది. ఆ తర్వాత మార్పులకు అవకాశం ఉండదు.
సీట్ల కేటాయింపు: అభ్యర్థి ఆలిండియా ర్యాంక్, రిజర్వేషన్, కాలేజీల్లో సీట్ల లభ్యత ఆధారంగా కంప్యూటర్ అల్గారిథమ్ ద్వారా సీట్లను కేటాయిస్తారు.
కాలేజీలో రిపోర్టింగ్: సీటు పొందిన విద్యార్థులు వెబ్సైట్ నుండి అలాట్మెంట్ లెటర్‌ను డౌన్లోడ్ చేసుకుని, తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో సహా నిర్దేశిత గడువులోగా కేటాయించిన కాలేజీకి వెళ్లి అడ్మిషన్ పొందాలి.




