
నాటు సారా గుట్టు రట్టు.. రంగంలోకి దిగిన ఎక్సైజ్
ఏన్కూరులో నాటు సారాపై ఎక్సైజ్ కొరడా…
8 మందిపై బైండ్ ఓవర్ చేసినట్టు తెలిపిన ఎక్సైజ్ ఎస్సై
CK న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు జులై 06 2026:
అక్రమ నాటు సారా తయారీ, విక్రయాలు, రవాణాను పూర్తిగా నిర్మూలించేందుకు ఎక్సైజ్ శాఖ చర్యలను మరింత ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో ఏన్కూరు మండల పరిధిలోని జన్నారం ఎస్టీ కాలనీ, ఎర్రబోడు తండా, పైనంపల్లి తండా,గార్లఓడ్డు గ్రామాల్లో ఎక్సైజ్ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
తనిఖీల సందర్భంగా గతంలో నాటు సారా కేసుల్లో పట్టుబడిన వ్యక్తులను గుర్తించి, భవిష్యత్తులో మళ్లీ అక్రమ కార్యకలాపాలకు పాల్పడకుండా ఉండేందుకు మొత్తం 8 మందిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
చట్టాన్ని ఉల్లంఘిస్తూ నాటు సారా తయారీ, విక్రయాలు లేదా రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
నాటు సారా సేవించడం వల్ల ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని, అనేక కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా నష్టపోతున్నాయని ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు.
గ్రామాల్లో అక్రమ మద్యం తయారీని పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక నిఘా కొనసాగుతుందని తెలిపారు. ప్రజలు కూడా అక్రమ మద్యం తయారీ లేదా విక్రయాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే ఎక్సైజ్ శాఖకు అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని వెల్లడించారు.
అలాగే యువత అక్రమ మద్యం వ్యాపారానికి దూరంగా ఉండాలని, చట్టబద్ధమైన ఉపాధి మార్గాలను ఎంచుకోవాలని అధికారులు సూచించారు. మండల వ్యాప్తంగా రానున్న రోజుల్లో కూడా ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని, అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఎలాంటి రాజీ లేకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ తనిఖీల్లో ఎక్సైజ్ ఎస్ఐ వసంతలక్ష్మి ఆధ్వర్యంలో సిబ్బంది వీరభద్రం, నరసింహచారి, సుమన్ పాల్గొన్నారు.




