
హయాత్ నగర్ ఎంఈవోకు రూ.5 వేల ఫైన్
ఆర్టీఐ పరిధిలో అడిగిన వివరాలను నిర్ణీత వ్యవధిలోగా ఇవ్వనందుకు హయాత్ నగర్ ఎంఈవో కర్నె శ్రీనివాస్ కు రాష్ట్ర సమాచార కమిషన్ గట్టి షాక్ ఇచ్చింది. నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆయనకు రూ.5వేల జరిమానా విధిస్తూ ఆర్టీఐ కమిషనర్ దేశాల భూపాల్ ఆదేశాలు జారీ చేశారు.
హయత్ నగర్ మండలానికి చెందిన అడ్వకేట్, ఆర్టీఐ కార్యకర్త మహేశ్ బాబు చొల్లేటి కొంతకాలం కిందట హయత్ నగర్ ఎంఈవో ఆఫీస్ నుంచి కొన్ని వివరాలను కోరారు. అయితే గడువు ముగిసినప్పటికీ ఎంఈవో శ్రీనివాస్ ఆ సమాచారాన్ని ఇవ్వలేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితుడు సమాచార కమిషన్ ను ఆశ్రయించాడు.
కమిషన్ ఎదుట ఈరోజు విచారణలో బాధితుడికి సమాచారం ఇవ్వడంలో ఎంఈవో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు కమిషనర్ నిర్ధారించారు. చట్టాన్ని గౌరవించని అధికారులపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిస్తూ.. ఎంఈవోకు వెంటనే రూ.5 వేల జరిమానా విధించారు.




