
గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ ముగ్గురు యువకులు
రూ.64 వేల విలువైన ఎండు గంజాయి, బైక్, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం – మరో ముగ్గురి కోసం గాలింపు
పాలకుర్తి/మహబూబాబాద్,(ck న్యూస్) ప్రతినిధి పల్లె దేవేందర్ గౌడ్ : మహబూబాబాద్ పట్టణంలోని గాయత్రి గుట్ట ప్రాంతంలో గంజాయి సేవిస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.64 వేల విలువైన 1 కిలో ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
టౌన్ ఇన్‌స్పెక్టర్ రఘుపతి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు హలవత్ నిశాంత్ (26), వాంకుడోత్ ప్రవీణ్ కుమార్ (25), బోట్ల సాయి చరణ్ (25)లను పోలీసులు పట్టుకున్నారు.
వారి వద్ద ఉన్న 1 కిలో ఎండు గంజాయితో పాటు ఒక బజాజ్ మోటార్‌సైకిల్, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న బోడ వినోద్, భూక్యా వీర, జి. ప్రశాంత్‌ల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా టౌన్ ఇన్‌స్పెక్టర్ రఘుపతి రెడ్డి మాట్లాడుతూ.. మత్తు పదార్థాల వినియోగం, రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి విక్రయాలు, వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే స్థానిక పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.




