
రోజువారీ కూలీకి వెళ్లాలా? రేషన్ కోసం ఎదురుచూడాలా?
షాద్‌నగర్‌లో మూడు నెలల తర్వాత రేషన్ బియ్యం పంపిణీ.. సమయం స్పష్టత లేక లబ్ధిదారుల అవస్థలు
పని వేళలు ప్రకటించాలని డిమాండ్
సి కే న్యూస్ షాద్ నగర్
మూడు నెలల విరామం తర్వాత షాద్‌నగర్‌లో రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభం కావడంతో రేషన్ దుకాణాల వద్ద లబ్ధిదారుల రద్దీ పెరిగింది. అయితే పంపిణీ సమయం పై స్పష్టత లేకపోవడంతో ప్రజలు, ముఖ్యంగా రోజువారీ కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మూడు నెలల బియ్యం ఒకేసారి అందుతుండటంతో లబ్ధిదారుల సంఖ్య భారీగా ఉంది. కానీ దుకాణం ఎప్పుడు తెరుస్తారు, బియ్యం పంపిణీ ఏ సమయానికి మొదలవుతుంది, ఎంత వరకు కొనసాగుతుంది అనే వివరాలు ముందుగా ప్రకటించకపోవడంతో ఉదయం నుంచే గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది.
కూలీని కోల్పోతున్నామని ఆవేదన
రోజు కూలీపై ఆధారపడే కుటుంబాలకు ఇది రెట్టింపు భారంగా మారింది. రేషన్ కోసం వస్తే పనికి వెళ్లలేకపోతున్నారు. పనికి వెళితే రేషన్ మిస్ అవుతుందేమోననే ఆందోళన ఉంది.
“సమయం ముందుగానే చెబితే ఆ సమయానికి వచ్చి బియ్యం తీసుకుంటాం. తెలియక రోజంతా దుకాణం ముందు కూర్చోవడం కష్టంగా ఉంది” అని పలువురు లబ్ధిదారులు తెలిపారు.
నిబంధనలు ఉన్నా అమలు కావడం లేదు
ప్రజా పంపిణీ వ్యవస్థ నిబంధనల ప్రకారం ప్రతి న్యాయధరల దుకాణం వద్ద పని వేళలు, సరుకుల లభ్యత, ధరలు, ఫిర్యాదుల కోసం అధికారుల వివరాలు ప్రదర్శించాలి. కానీ క్షేత్రస్థాయిలో ఈ నిబంధనలు సరిగా అమలు కావడం లేదని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు.
అధికారుల నుంచి స్పష్టత కోరుతున్న ప్రజలు
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి రేషన్ దుకాణం వద్ద పంపిణీ తేదీ, ప్రారంభ మరియు ముగింపు సమయాన్ని స్పష్టంగా ప్రకటించాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే నిర్ణీత పని వేళల్లో దుకాణాలు తెరిచేలా, లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా సరిపడా సమయం పంపిణీ జరిగేలా అధికారులు పర్యవేక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
పేద, మధ్యతరగతి కుటుంబాల సమయాన్ని, రోజువారీ కూలీని దృష్టిలో ఉంచుకుని అధికారులు మరియు రేషన్ డీలర్లు సమన్వయంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.




