
శ్రీరాంపురంలో ఘనంగా తీజ్ ఉత్సవాలు
ఆటపాటలతో సందడి చేసిన బంజారా మహిళలు
సీకే న్యూస్ ఖమ్మం ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఆగస్టు 17 2026: ఏన్కూర్ మండలం శ్రీరాంపురం గ్రామంలో తీజ్ ఉత్సవాలను బంజారా సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు. ఆదివారం రాత్రి జరిగిన వేడుకల్లో బంజారా మహిళలు, యువతులు రంగురంగుల సంప్రదాయ దుస్తులు ధరించి ఆటపాటలతో సందడి చేశారు.
డోలు, షెహనాయి వాయిద్యాల నడుమ సంప్రదాయ నృత్యాలు చేస్తూ గ్రామ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామ చెరువు వద్దకు చేరుకుని తీజ్ దేవత విగ్రహాన్ని భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు.
ఈ వేడుకల్లో గ్రామ పెద్దలు, మహిళలు, యువతులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బంజారా సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ప్రతి ఏడాది తీజ్ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేసి కార్యక్రమాన్ని ముగించారు.




