
ఆర్యభట్ట స్కూల్‌లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం
వార్డెన్ వేధింపులే కారణమంటున్న తల్లిదండ్రులు..
వరంగల్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స
ఘటనపై సమాచారం ఇవ్వలేదని ఆరోపణ..
రూ.5 లక్షలకు పైగా ఖర్చు – నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్
బెదిరించి వీడియో తీశారని తల్లిదండ్రుల ఆరోపణ
గతంలోనూ ఇలాంటి ఘటనలు
విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్
సి కే న్యూస్, తొర్రూరు : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని ఆర్యభట్ట పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న హిమాన్షు అనే విద్యార్థి ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ప్రస్తుతం విద్యార్థి వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. తమ కుమారుడు ఆత్మహత్యాయత్నానికి పాఠశాల వార్డెన్ వెంకన్న వేధింపులే కారణమని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక పని చెబుతూ ఇబ్బందులకు గురిచేసేవాడని, కొట్టేవాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
సమాచారం ఇవ్వలేదని ఆరోపణ
తమ కుమారుడు ఏ సమయంలో ఎలుకల మందు తాగాడో కూడా తమకు తెలియదని, ఘటన జరిగిన విషయాన్ని పాఠశాల యాజమాన్యం తమకు వెంటనే తెలియజేయలేదని తల్లిదండ్రులు ఆరోపించారు. తమ కుమారుడి ఆరోగ్య పరిస్థితి గురించి కూడా పాఠశాల యాజమాన్యం తమకు సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వాపోయారు. ఇప్పటివరకు స్కూల్ యాజమాన్యం ఫోన్ చేసి కూడా పరామర్శించలేదని ఆరోపించారు.
రూ.5 లక్షలకు పైగా వైద్య ఖర్చులు
విద్యార్థి చికిత్స కోసం ఇప్పటికే రూ.5 లక్షలకు పైగా ఖర్చు అయిందని తల్లిదండ్రులు తెలిపారు. తమకు జరిగిన ఆర్థిక నష్టాన్ని పాఠశాల యాజమాన్యం భర్తీ చేయాలని, నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
బెదిరించి వీడియో తీశారని ఆరోపణ
తమ కుమారుడిని బెదిరించి, తాను ఎవరి బలవంతం లేకుండానే మందు తాగానని చెప్పిస్తూ వీడియో తీశారని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని వారు కోరారు.
విద్యాశాఖ అధికారులపై స్థానికుల ఆగ్రహం
ఆర్యభట్ట పాఠశాలలో గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నప్పటికీ విద్యాశాఖ అధికారులు కేవలం తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల భద్రత విషయంలో నిర్లక్ష్యానికి తావులేకుండా పాఠశాలపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇకనైనా విద్యాశాఖ అధికారులు స్పందించి పాఠశాల యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవడంతో పాటు విద్యార్థులకు భరోసా కల్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.




