KhammamPoliticalTelangana

కాల్వలో దూకిన భర్త.. ఉరి వేసుకున్న భార్య

కాల్వలో దూకిన భర్త.. ఉరి వేసుకున్న భార్య

కాల్వలో దూకిన భర్త.. ఉరి వేసుకున్న భార్య

ఖమ్మం జిల్లా: క్షణికావేశంలో నాగార్జునసాగర్‌ కాల్వలో దూకిన గల్లంతయ్యాడనే విషయం తెలిసి సదరు వ్యక్తి భార్య ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అమ్మపాలెంలో బుధవారం చోటు చేసుకున్న ఘటన వివరాలిలా ఉన్నాయి.

ఆటో నడుపుతూ జీవనం సాగించే అమ్మపాలెంనకు చెందిన తేజావత్‌ హరిప్రసాద్‌కు అన్నవరం గ్రామానికి చెందిన సునీత(28)తో పదిహేనేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇటీవలే ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోగా అప్పులయ్యాయి.

దీనికి తోడు వారం రోజులుగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు మొదలుకావడంతో హరిప్రసాద్‌ బుధవారం ఉదయం బయటకు వెళ్లి తన అన్న రామ్మూర్తికి ఫోన్‌ చేసి చనిపోతున్నానని, బిడ్డలను జాగ్రత్తగా చూసుకోవాలని కోరాడు. ఇదే సమాచారం సర్పంచ్‌కు కూడా ఇవ్వగా వారు పోలీసులకు తెలపడంతో ఫోన్‌ నంబర్‌ ఆధారంగా వి.వెంకటాయపాలెం సమీపాన ఎన్‌ఎస్‌పీ ప్రధాన కాల్వ వద్ద ఉన్నట్లు గుర్తించారు.

అక్కడకు వెళ్లి పరిశీలించగా హరిప్రసాద్‌ ఆటో, చెప్పులు, సెల్‌ఫోన్‌ ఉండడంతో ఆయన కాల్వలో దూకాడనే అనుమానంతో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందంతో గాలింపు చేపట్టగా రాత్రి వరకు ఆచూకీ లభించలేదు. కాగా, భర్త కాల్వలో దూకాడని తెలియగానే సునీత ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

హరిప్రసాద్‌ దంపతులు ఇటీవలే ప్రైవేట్‌ బ్యాంకులో రుణానికి దరఖాస్తు చేసుకోగా విచారణకు వచ్చిన సిబ్బంది ఎంత పిలిచినా స్పందన లేకపోవడంతో కిటికీలో నుంచి చూశారు. దీంతో సునీత ఉరి వేసుకుని కనిపించగా స్థానికులకు చెప్పడంతో పరిశీలించేసరికి ఆమె మృతి చెందింది. అయితే, సునీత బలవన్మరణంపై ఆమె తరఫు బంధువులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఘటనపై అందిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని, విచారణలో వివరాలు వెల్లడవుతాయని ఎస్‌ఐ సూరజ్‌ తెలిపారు. కాగా, హరిప్రసాద్‌ కానరాకుండా పోవడం, సునీత ఎందుకు మృతి చెందిందో తెలియక వీరి పిల్లలు మనోహర్, భార్గవి అడుగుతున్న ప్రశ్నలు స్థానికులను కంటతడి పెట్టించాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button