
తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి.. ఓటర్ల జాబితా షెడ్యూల్ రిలీజ్
తెలంగాణలో త్వరలో ఖాళీ కాబోతున్న వరంగల్- ఖమ్మం-నల్గొండ, మహబూబ్ నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల భర్తీ కోసం ఈసీ కసరత్తు మొదలు పెట్టింది. ఈ రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు నూతన ఓటర్ల జాబితా తయారీ షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) సి. సుదర్శన్ రెడ్డి గురువారం విడుదల చేశారు.
ఈ నియోజకవర్గాల స్థానాల గడువు మార్చి 2027తో ముగియనుండటంతో భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కొత్తగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయనున్నారు. 1 నవంబర్ 2026ను అర్హత తేదీగా పరిగణనలోకి తీసుకుని ఈ ప్రక్రియను చేపట్టనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
కాగా హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్న సురభి వాణి దేవీ, వరంగల్- ఖమ్మం-నల్గొండ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్న తీన్మార్ మల్లన్న పదవీ కాలం వచ్చే మార్చితో ముగియనుంది. పాత ఓటర్లు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందే..

గత ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నవారు కూడా ఈసారి కొత్తగా నమూనా ఫారమ్-18 (Form-18) ద్వారా తిరిగి దరఖాస్తు చేసుకోవడం తప్పనిసరి అని ఈసీ స్పష్టం చేసింది. పాత ఓటరు జాబితా ఆధారంగా నేరుగా పేరు నమోదు చేయబడదని స్పష్టం చేసింది. దరఖాస్తుతో పాటు అవసరమైన విద్యా అర్హత సర్టిఫికెట్ల ధ్రువీకరించిన కాపీలను జతచేయాల్సి ఉంటుంది.
అర్హులైన పట్టభద్రులు CEO అధికారిక వెబ్‌సైట్ https://ceotelangana.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా నిర్ణీత ఫారమ్‌ను పూర్తి చేసి అవసరమైన పత్రాలతో ERO / AERO / డెసిగ్నేటెడ్ అధికారులకు నేరుగా కానీ, పోస్ట్ ద్వారా కానీ అందజేయవచ్చని సీఈఓ కార్యాలయం తెలిపింది. ఓటరు జాబితా షెడ్యూల్:
పబ్లిక్ నోటీసు విడుదల: 28 సెప్టెంబర్2026
ఫారమ్-18 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 6 నవంబర్ 2026
డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రచురణ: 25 నవంబర్ 2026
అభ్యంతరాలు, క్లెయిమ్‌ల స్వీకరణ: 25 నవంబర్ 2026 నుండి 10 డిసెంబర్ 2026 వరకు
తుది ఓటర్ల జాబితా ప్రచురణ: 30 డిసెంబర్ 2026




