
గార్లఓడ్డులో చోరీల బీభత్సం
రాత్రివేళ వాహనాలపై దొంగల కన్ను
వాహనాల నుంచి బ్యాటరీలు, డీజిల్ అపహరణ.. రూ.60 వేలకు పైగా నష్టం
వరుస చోరీలతో వాహన యజమానుల్లో ఆందోళన
సీకే న్యూస్ ఖమ్మం ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు సెప్టెంబర్ 22 2026: మండల పరిధిలోని గార్లఓడ్డు గ్రామం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పరిసర ప్రాంతంలో రాత్రి వేళ నిలిపి ఉంచుతున్న వాహనాలు చోరీలకు గురవుతున్నాయని వాహన యజమానులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు వాహనాలను లక్ష్యంగా చేసుకుని బ్యాటరీలు, స్టెప్‌నీ టైర్లు, డీజిల్‌తో పాటు విలువైన సామగ్రిని అపహరిస్తున్నట్లు వారు తెలిపారు.
వాహన యజమాని భూక్య నరసింహ తెలిపిన వివరాల ప్రకారం.. దేవస్థానం పరిసర ప్రాంతంలో రాత్రి నిలిపి ఉంచిన భారత్ బెంజ్ వాహనం నుంచి రెండు బ్యాటరీలు, స్టెప్‌నీ టైరు, డీజిల్ తదితర సామగ్రిని గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. చోరీకి గురైన వస్తువుల విలువ సుమారు రూ.60 వేలకు పైగా ఉంటుందని ఆయన తెలిపారు. ఉదయం వాహనం వద్దకు వెళ్లి చూడగా బ్యాటరీలు, ఇతర సామగ్రి కనిపించకపోవడంతో చోరీ జరిగిన విషయం గుర్తించినట్లు పేర్కొన్నారు.
ఇదే ప్రాంతంలో గతంలోనూ ఇతర వాహనాల నుంచి బ్యాటరీలు, డీజిల్, టైర్లు తదితర వస్తువులు చోరీకి గురైనట్లు స్థానికులు చెబుతున్నారు. రాత్రి సమయంలో వాహనాలను రహదారి పక్కన లేదా దేవస్థానం పరిసరాల్లో నిలిపి ఉంచాల్సి వస్తుండటంతో భద్రతపై వాహన యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరుసగా చోరీలు జరుగుతున్న నేపథ్యంలో రాత్రి వేళల్లో వాహనాల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని పేర్కొన్నారు.
ఈ ఘటనలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి, చోరీలకు పాల్పడుతున్న వ్యక్తులను గుర్తించేందుకు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించాలని వాహన యజమానులు కోరుతున్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా పెంచడంతో పాటు రాత్రి వేళల్లో గస్తీ ముమ్మరం చేయాలని విజ్ఞప్తి చేశారు. చోరీలకు పాల్పడుతున్న వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు, వాహన యజమానులు కోరుతున్నారు.




