HyderabadPoliticalTelangana

తెలంగాణ రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక.. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై వేటు?

తెలంగాణ రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక.. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై వేటు?

తెలంగాణ రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక.. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై వేటు?

తెలంగాణ రాజకీయాల్లో మరో ఉప ఎన్నికకు తెరలేచే అవకాశాలు ఉన్నాయనే చర్చ మొదలైంది. హుజూరాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై అసెంబ్లీలో అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణలపై జరుగుతున్న ఎథిక్స్‌ కమిటీ విచారణ కీలక దశకు చేరింది. ఈనెల 30న కమిటీ తుది నివేదిక, దాని ఆధారంగా శాసనసభ తీసుకునే నిర్ణయంపైనే ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది.

మార్చి 29న అసెంబ్లీలో వివాదం

2026 మార్చి 29న అసెంబ్లీలో మైనింగ్‌ అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా కడియం శ్రీహరి ప్రసంగాన్ని కౌశిక్‌రెడ్డి అడ్డుకోవడంతోపాటు అనుచిత హావభావాలు ప్రదర్శించారని ఫిర్యాదులు వచ్చాయి. ఈ వ్యవహారాన్ని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఎథిక్స్‌ కమిటీకి నివేదించారు.ఎథిక్స్‌ కమిటీ ఆగస్టు 29న అంశాన్ని పరిశీలించింది. అనంతరం కౌశిక్‌రెడ్డికి నోటీసులు జారీ చేసి లిఖితపూర్వక వివరణ కోరింది. సెప్టెంబరు 5లోగా సమాధానం ఇవ్వాలని తొలుత గడువు విధించింది.

ఆరు వారాల గడువు కోరిన కౌశిక్‌..

నోటీసుకు స్పందించిన కౌశిక్‌రెడ్డి ఆరు వారాల సమయం కోరారు. తనకు అందించిన వీడియో ఫుటేజీ పూర్తి స్థాయిలో లేదని, మార్చి 29న జరిగిన అసెంబ్లీ మొత్తం పరిణామాలకు సంబంధించిన పూర్తి వీడియో ఇవ్వాలని కోరారు. పూర్తి ఫుటేజీని పరిశీలించిన తర్వాతే సమగ్ర వివరణ ఇస్తానని ఆయన కమిటీకి తెలిపారు.ఈ అంశంపైనే ఈనెల 24న ఎథిక్స్‌ కమిటీ మరోసారి సమావేశమైంది. బీఆర్‌ఎస్‌ తరఫున పూర్తి వీడియో ఫుటేజీ ఇవ్వాలని కోరగా.. సమావేశంలో తుది నిర్ణయం తీసుకోకుండా సెప్టెంబరు 30కి వాయిదా వేశారు. 30న ఏం జరుగుతుంది?

ఇప్పుడు అందరి దృష్టీ ఈనెల 30న జరిగే ఎథిక్స్‌ కమిటీ సమావేశంపైనే ఉంది. కమిటీ కౌశిక్‌రెడ్డి వివరణ, అందుబాటులో ఉన్న వీడియో ఫుటేజీ, ఫిర్యాదులు, సభలో జరిగిన పరిణామాలను పరిశీలించి తన సిఫారసును ఖరారు చేసే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం కౌశిక్ రెడ్డిపై సీరియస్ గా ఉండటం, వర్షాకాల సమావేశాల్లోనూ కౌశిక్ పై చర్యలకు పలువురు కాంగ్రెస్ శాసనసభ్యులు డిమాండ్ కూడా చేశారు. దీంతో ఎథిక్స్ కమిటీ కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకుంటారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో కొనసాగుతుంది.

వేటు పడితే.. హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక?

ఎథిక్స్‌ కమిటీ విచారణ అనంతరం కౌశిక్‌రెడ్డిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందన్న చర్చజరుగుతుంది. అయితే ఎలాటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ సభ్యత్వ రద్దు జరిగి, హుజూరాబాద్‌ స్థానం ఖాళీగా ప్రకటిస్తే అక్కడ ఉప ఎన్నిక అనివార్యమయ్యే అవకాశం ఉంటుంది. అదే జరిగితే ఇప్పటికే ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో వేడెక్కిన తెలంగాణ రాజకీయాల్లో మరో నియోజకవర్గం కూడా ఉప ఎన్నికల బరిలోకి వచ్చినట్టవుతుంది. ఎమ్మెల్యే దానం నాగేందర్‌..

ఇటీవల ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అనర్హత వ్యవహారం కూడా కీలక మలుపు తీసుకుంది. తెలంగాణ హైకోర్టు ఆయనను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించగా, ఆ కేసులో పిటిషనర్లలో పాడి కౌశిక్‌రెడ్డి కూడా ఉన్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో ఖైరతాబాద్‌ తర్వాత హుజూరాబాద్‌ కూడా ఉప ఎన్నికల కేంద్రంగా మారుతుందా అన్న చర్చకు ప్రాధాన్యం ఏర్పడింది. అయితే కౌశిక్‌రెడ్డి విషయంలో ప్రస్తుతం ఉన్నది విచారణ దశ మాత్రమే. ఎథిక్స్‌ కమిటీ ఏ నివేదిక ఇస్తుంది? శాసనసభ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అన్నదానిపైనే హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక ఉంటుందా లేదా అన్నది ఆధారపడి ఉంటుంది.

మరోలా బీఆర్‌ఎస్‌ వాదన…

కౌశిక్‌రెడ్డిపై చర్యల విషయంలో బీఆర్‌ఎస్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఎథిక్స్‌ కమిటీ విచారణ పారదర్శకంగా జరగాలని, పూర్తి వీడియో ఫుటేజీని పరిశీలించాలని ఆ పార్టీ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి కోరారు. కౌశిక్‌రెడ్డి విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని పేర్కొన్నారు.

ఏది ఏమైనప్పటికీ కౌశిక్‌రెడ్డి సభ్యత్వంపై తుది నిర్ణయం ఇంకా వెలువడలేదు. ఎథిక్స్‌ కమిటీ విచారణ కొనసాగుతోంది. కమిటీ నివేదిక, దానిపై శాసనసభ నిర్ణయం ఏం ఉండబోతుంది.. తెలంగాణ రాజకీయాల్లో మరో ఉప ఎన్నికకు దారితీస్తుందా? అన్నదే ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button