
గురుకుల పాఠశాలలో కూలిన స్లాబ్ పెచ్చులు.. ఇద్దరు విద్యార్థినులకు గాయాలు!
శిథిలావస్థకు చేరిన భవనం.. విద్యార్థుల ప్రాణాలకు రక్షణ కరువు!
ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు
పాఠశాలను పరిశీలించి విద్యార్థినులను పరామర్శించిన ఖమ్మం జిల్లా స్వేరోస్ కమిటీ
మరమ్మతులకు తక్షణమే నిధులు విడుదల చేయాలి
సి కే న్యూస్
ఖమ్మం జిల్లా బోనకల్ మండల కేంద్రంలోని ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో అపరిశుభ్రత, భవన నిర్వహణ లోపాలు ఒకవైపు ఉంటే.. మరోవైపు శిథిలావస్థకు చేరిన భవనం విద్యార్థినుల ప్రాణాలకు ముప్పుగా మారుతోంది. పాఠశాలలోని తొమ్మిదో తరగతి గదిలో శనివారం స్లాబ్ పెచ్చులు ఊడి పడటంతో ఇద్దరు విద్యార్థినులు గాయపడిన ఘటన కలకలం రేపింది. ఈ ప్రమాదంలో పూజిత, కీర్తన అనే ఇద్దరు విద్యార్థినులకు గాయాలయ్యాయి. దీంతో తోటి విద్యార్థినులు భయాందోళనకు గురయ్యారు. విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాదకరంగా మారిన పాఠశాల భవనం*
పాఠశాల భవనాన్ని పరిశీలిస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో స్పష్టంగా కనిపిస్తోంది. తరగతి గదుల పైకప్పుల నుంచి సిమెంట్ పెచ్చులు పెద్ద ఎత్తున ఊడిపోవడంతో పాటు లోపల ఉన్న ఇనుప చువ్వలు సైతం బయటకు కనిపిస్తున్నాయి. పైకప్పు పలుచోట్ల పగుళ్లు ఏర్పడి శిథిలావస్థకు చేరినట్లు ఫొటోల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
వరండా పైకప్పుపై కూడా పొడవైన పగుళ్లు ఏర్పడి పెచ్చులు ఊడిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థినులు ప్రతిరోజూ తరగతి గదుల్లో చదువుకోవాల్సి రావడం ఆందోళన కలిగిస్తోంది.
ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన ఖమ్మం జిల్లా స్వేరోస్ కమిటీ
విద్యార్థినులకు గాయాలైన విషయం తెలుసుకున్న ఖమ్మం జిల్లా స్వేరోస్ కమిటీ సభ్యులు గురుకుల పాఠశాలకు చేరుకుని గాయపడిన విద్యార్థినులను పరామర్శించారు.
అనంతరం పాఠశాల భవనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. భవనం పైకప్పుల పరిస్థితి, పెచ్చులు ఊడిపడుతున్న ప్రాంతాలను పరిశీలించి ఆందోళన వ్యక్తం చేశారు.
స్వేరో అధ్యక్షులు కొండ్రు రామచంద్రు మాట్లాడుతూ.. గురుకుల పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుందని, విద్యార్థినులు చదువుకునే తరగతి గదుల్లోనే ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకోవడం బాధాకరమన్నారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు వారి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందన్నారు. చిన్నారులకు మరోసారి ఇలాంటి ప్రమాదం జరగకుండా అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు. తదుపరి క్లాసులు భవనం మరమ్మతులు చేపట్టే వరకు విద్యాభ్యాసం ఆగకుండా వేరే చోట విద్యార్థులకు తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
మరమ్మతులకు తక్షణమే నిధులు విడుదల చేయాలి
పాఠశాల భవనం పరిస్థితిని ఉన్నతాధికారులు స్వయంగా పరిశీలించి, ప్రమాదకరంగా ఉన్న తరగతి గదులకు మరమ్మతులు చేపట్టాలని, అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని ఖమ్మం జిల్లా స్వేరోస్ అధ్యక్షులు కొండ్రు రామచంద్రు స్వేరో జిల్లా ప్రధాన కార్యదర్శి సోమపొంగు శ్యామ్ సుందర్ స్వేరో ఎగజ్యుకుటివ్ మెంబర్ కన్నెపోగు రాజేష్ స్వేరో మరియు బహుజన విద్యార్థి సంఘాల నాయకులు రాజశేఖర్, మధు తదితరులు పాల్గొన్నారు.




