
చదివింది హోమియోపతి.. చేసేది MBBS పీడియాట్రిక్ స్పెషలిస్ట్ వైద్యం
Web desc : చిన్నారుల ఆరోగ్యం విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన వైద్యులు షాద్‌నగర్ పట్టణంలో విమర్శలపాలవుతున్నారు. పేరు స్పెషలిస్టుది పెట్టి.. అర్హతలు లేని వ్యక్తులు వైద్యం చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పీడియాట్రిక్ స్పెషలిస్టుల పేర్లు వాడుకుంటూ ఆయుర్వేద వైద్యుడు చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనే వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. స్థానికంగా చలామణిలో ఉన్న శ్రీ ఆదిత్య బాలాజీ చిన్నపిల్లల హాస్పిటల్‌లో జరుగుతున్న వ్యవహారంపై బాధితులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పేరు స్పెషలిస్టులది.. వైద్యం మరొకది.. పసిపిల్లలు తమ బాధను వ్యక్తపరచలేరనే కనీస మానవత్వం లేకుండా ఈ ఆస్పత్రి యాజమాన్యం వ్యాపార ధోరణితో వ్యవహరిస్తోందని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఆసుపత్రి బోర్డులపై ఒక పీడియాట్రిక్ నిపుణుడి పేరు ప్రదర్శిస్తూ, ఆచరణలో మాత్రం బీహెచ్ఎంఎస్ అర్హతలు కలిగిన వ్యక్తులతో పరీక్షలు చేయిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.
BHMS చేసిన వ్యక్తులు హోమియోపతి వైద్యం చేసుకోవచ్చు. పిల్లలకు వచ్చే జలుబు, దగ్గు, రోగనిరోధక శక్తి సమస్యలు, టాన్సిల్స్, అలర్జీలు మరియు జీర్ణక్రియ సమస్యలకు హోమియోపతి మందుల ద్వారా మాత్రమే చికిత్స అందించడానికి అర్హులు. నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి (NCH) నిబంధనల ప్రకారం BHMS డాక్టర్లు పిల్లలకు యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ లేదా ఇతర అల్లోపతి (Modern Medicine) మందులను ప్రిస్క్రైబ్ చేయకూడదు (క్రాస్-ప్రాక్టీస్ నిషేధం).
కానీ ఈ ఆస్పత్రిలో అక్రమంగా MBBS/MD (Pediatrics) వైద్యుడి పేరుతో వైద్యం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రిస్క్రిప్షన్లు రాయడం, లేబొరేటరీ పరీక్షలు సూచించడం వంటివి అక్కడ అనధికార వ్యక్తులే చేస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. సున్నితమైన పీడియాట్రిక్ వైద్యంలో అర్హతల్లేని వారితో వైద్యం చేయించడం వల్ల చిన్నారుల ప్రాణాలకు తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చిన్న సమస్యకే అడ్డగోలు దోపిడీ! సాధారణ జలుబు, తేలికపాటి దగ్గు, జ్వరం వంటి చిన్నపాటి సమస్యలతో వస్తే చాలు.. ఏదో పెద్ద ప్రమాదం ముంచుకొచ్చిందంటూ తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారుల పట్ల తల్లిదండ్రులకుండే ఆందోళనను ఆసరాగా చేసుకుని, అవసరం లేని పరీక్షలు రాస్తూ, బలవంతంగా ఆసుపత్రిలో చేర్పించి వేలాది రూపాయలు లాగుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అధికారులు మొద్దునిద్ర వీడేనా? పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ క్లినిక్‌లు, చిన్నపిల్లల ఆసుపత్రులపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ (DMHO) తక్షణమే తనిఖీలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
ఆసుపత్రి అనుమతులు, స్పెషలిస్ట్ వైద్యులు ఉన్నారా, లేరా? వసూలు చేస్తున్న ఫీజులపై సమగ్ర విచారణ జరిపి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నిర్లక్ష్యానికి తావులేకుండా, నిజానిజాలను వెలికి తీసి పసిపిల్లల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని పేర్కొంటున్నారు.




