
ప్రభుత్వ దవాఖానాకు సిరంజీల అందజేత
ఏన్కూరు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం
సీకే న్యూస్ ఖమ్మం ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు నవంబర్ 02 2026: ఏన్కూరు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ దవాఖానాకు సిరంజీలను అందజేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్న రోగులకు అవసరమైన వైద్య పరికరాల అందుబాటుకు తమ వంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో ప్రెస్ క్లబ్ సభ్యులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ప్రభుత్వ దవాఖానకు వచ్చే పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. సమాజంలో ప్రజలకు సమాచారాన్ని అందించే బాధ్యతతో పాటు, సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాత్ర పోషించాలనే లక్ష్యంతో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సిరంజీలను అందజేసినట్లు తెలిపారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు మరింత మెరుగుపడేందుకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కోరారు. భవిష్యత్తులోనూ ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రెస్ క్లబ్ కృషి చేస్తుందని పేర్కొన్నారు.
ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడమే కాకుండా, అవసరమైన సందర్భాల్లో సమాజానికి అండగా నిలవడం కూడా పాత్రికేయుల సామాజిక బాధ్యతలో భాగమని ఈ కార్యక్రమం చాటిచెప్పింది.




