
నీళ్లనుకొని కొడుకుకు కెమికల్ తాగించిన తల్లి..
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో దారుణం జరిగింది. ఆస్పత్రిలో జ్వరంతో బాధపడుతున్న కొడుకుకి తల్లి మాత్ర ఇచ్చింది. ఆ తర్వాత తాగు నీళ్లనుకొని పొరపడి ప్రమాదకర రసాయనాన్ని ఇచ్చింది.అది తాగడంతో కొడుకు వెంటనే మృతి చెందడం కలకలం రేపింది.
నల్గొండ జిల్లా అనుముల మండలం చిన్న అనుముల గ్రామానికి చెందిన సండ్ర సత్యనారాయణ, రామలింగమ్మ దంపతుల కుమారుడు గణేశ్. హైదరాబాద్‌లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న గణేశ్.. భవిష్యత్తులో ప్రయోజకుడై తల్లిదండ్రులను బాగా చూసుకుంటాడని ఆ కుటుంబం ఎన్నో కలలు కన్నది.
గత రెండు రోజులుగా గణేశ్‌ను తీవ్రమైన జ్వరం వేధిస్తోంది. కొడుకు నీరసాన్ని చూడలేక రామలింగమ్మ శనివారం ఉదయం మిర్యాలగూడలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడ పరీక్షించిన వైద్య సిబ్బంది.. జ్వరం తీవ్రత తగ్గడానికి ముందుగా ఒక పారాసిటమాల్ మాత్ర వేయమని చెప్పారు.
బిడ్డకు త్వరగా ఉపశమనం కలగాలన్న ఆరాటంతో రామలింగమ్మ మాత్ర తీసుకుంది. కానీ ఆసుపత్రిలోని నీళ్ల క్యాన్ వద్దకు వెళితే అందులో చుక్క నీరు లేదు. నీళ్ల కోసం ఆ ప్రాంగణంలో వెతుకుతూ.. పక్కనే ఉన్న ల్యాబ్‌లోకి ప్రవేశించింది.
అక్కడ ఒక క్యాన్‌లో ఉన్న రంగులేని ద్రవాన్ని చూసి.. అమాయకత్వంతో అది తాగునీరే అనుకుంది. తన వెంట తెచ్చుకున్న బాటిల్లో ఆ ద్రవాన్ని నింపుకుని వచ్చి కొడుకుకు అందించింది. అమ్మ తెచ్చిచ్చిన నీళ్లే కదా అని ఏమాత్రం సందేహించకుండా గణేశ్ ఆ బాటిల్‌ను తీసుకున్నాడు.
కానీ ఆ బాటిల్లో ఉన్నది ప్రాణం పోసే నీళ్లు కావు.. ప్రాణం తీసే ఫార్మాల్డిహైడ్ అనే అత్యంత ప్రమాదకరమైన రసాయనం అనే విషయాన్ని గ్రహించలేకపోయాడు. రెండు గుటకలు మింగగానే ఆ రసాయనం ప్రభావానికి గణేశ్ ఊపిరి ఆడక.. తీవ్రమైన అంతర్గత గాయాలతో విలవిలలాడిపోయాడు.
వైద్యులు అత్యవసర చికిత్స అందించేలోపే ఆ యువకుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కొద్దిసేపటి క్రితం వరకు తన కళ్లముందే తిరిగిన కొడుకు.. తన చేతులతో తాగించిన నీళ్ల వల్లే శవమై పడి ఉండటం చూసి ఆ తల్లి గుండె పగిలేలా విలపిస్తోంది.
‘బిడ్డా.. దాహం తీరుద్దామనుకున్నానే కానీ నీ ఊపిరి తీస్తాననుకోలేదే’ అంటూ ఆమె రోధించిన తీరు ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న వారందరినీ కంటతడి పెట్టించాయి. ఈ ఘోర కలికి ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హాస్పిటల్లో తాగునీరు అందుబాటులో ఉంచకపోవడం ఒక తప్పయితే.. ల్యాబ్‌లో ఉండే ప్రమాదకరమైన రసాయనాలను సామాన్యులకు అందుబాటులో ఉండేలా, ఎటువంటి హెచ్చరిక బోర్డులు లేకుండా ఉంచడం క్షమించరాని నేరమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆసుపత్రి ముందు బాధితులు ఆందోళన చేపట్టగా.. ఒకటో పట్టణ సీఐ అక్కడకు చేరుకొని వారిని శాంతింపజేశాడు. తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




