KhammamPoliticalTelangana

కాంగ్రెస్ వర్సెస్ సీపీఐ.. ఖమ్మం జిల్లాలో భట్టి, పొంగులేటికి ఎదురుదెబ్బ

కాంగ్రెస్ వర్సెస్ సీపీఐ.. ఖమ్మం జిల్లాలో భట్టి, పొంగులేటికి ఎదురుదెబ్బ

కాంగ్రెస్ వర్సెస్ సీపీఐ.. ఖమ్మం జిల్లాలో భట్టి, పొంగులేటికి ఎదురుదెబ్బ

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగులుతోంది. మిత్రపక్షం సీపీఐ బంధాన్ని తెంచేసుకుంది.

కొన్ని చోట్ల బీఆర్‌ఎస్‌ పార్టీతో పొత్తు కుదుర్చుకోగా.. మరికొన్ని చోట్ల ఒంటరిగా బరిలోకి దిగింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్‌ పార్టీకి సహకరిస్తున్నా కనీస గౌరవం ఇవ్వడం లేదని సీపీఐ కినుక వహించింది.

దీనికితోడు క్షేత్రస్థాయిలో సీపీఐని గుర్తించకపోవడంతో మున్సిపల్‌ ఎన్నికల్లో భారీ షాక్‌ ఇచ్చింది. ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి, భట్టి విక్రమార్కకు సీపీఐ ఝలక్‌ ఇచ్చింది.

మునిసిపల్ ఎన్నికల్లో సీపీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి, భట్టి విక్రమార్కకు వ్యతిరేకంగా.. వారి తీరుపై మండిపడుతూ ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగింది. కొన్ని మున్సిపాలిటీల్లో అన్నీ స్థానాల్లో పోటీ చేస్తూ నామినేషన్లు వేసింది.

ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్, సీపీఐకి పొత్తు కుదరలేదు. కొత్తగూడెంలో సీపీఐ డిమాండ్లకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించలేదు. కొత్తగూడెం మున్సిపాలిటీలో మొత్తం 60 డివిజన్లు ఉండగా అన్నింటిలో సీపీఐ పోటీ చేస్తోంది. ఈ సందర్భంగా అన్నీ డివిజన్‌లలో సీపీఐ అభ్యర్థులు నామినేషన్లు వేశారు.

కొత్తగూడెం మున్సిపాలిటీలో సీపీఐ చెరి సగం డిమాండ్‌ చేయగా.. కాంగ్రెస్‌ 20 మాత్రమే ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయడంతో సీపీఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

దీంతో శుక్రవారం నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో మొత్తం 60 డివిజన్లలోనూ సీపీఐ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇక ఇల్లందులో కూడా కాంగ్రెస్, సీపీఐ మధ్య దోస్తీ కుదరకపోవడంతో 6 వార్డుల్లో సీపీఐ నామినేషన్లు వేశారు.

ఇదే జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలోని ఏదులాపురం మునిసిపాలిటీలో సీపీఐ ఒంటరిగా పోటీ చేస్తోంది.

ఏదులాపురం మున్సిపాలిటీలో మొత్తం 32 వార్డులుండగా 15 వార్డుల్లో సీపీఐ నామినేషన్లు వేసింది. అయితే కాంగ్రెస్‌ సీపీఐ వేసిన డివిజన్లతోపాటు మొత్తం 32 వార్డుల్లో నామినేషన్లు వేసింది.

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్‌, సీపీఐ వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. ఇక్కడ మొత్తం 22 వార్డులు ఉండగా పొత్తు కుదరకపోవడంతో సీపీఐ ఐదు చోట్ల నామినేషన్ వేసింది.

కాంగ్రెస్‌ పార్టీ ఆ స్థానాలతోపాటు మొత్తం అన్ని చోట్ల నామినేషన్లు వేసింది. ఇన్నాళ్లు కలిసి ఉన్న సీపీఐ, కాంగ్రెస్‌ పార్టీలు మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా చెరో దారి చూసుకోవడం రాజకీయంగా సంచలనం రేపుతోంది.

కాగా చెన్నూరు నియోజకవర్గంలోని క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో సీపీఐ అనూహ్యంగా బీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతుతో పోటీలో దిగింది. అక్కడ గులాబీ, ఎర్రజెండాలు కలవడం చర్చనీయాంశంగా మారింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button