
ప్రాణం తీసిన పని ఒత్తిడి.. హైదరాబాద్‌లో టెకీ ఆత్మహత్య..
హైదరాబాద్‌లోని మియాపూర్‌లో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఓ యువకుడు పని ఒత్తిడి తట్టుకోలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుని కుటుంబానికి తీరని దుఃఖాన్ని మిగిల్చాడు. వివరాలు… ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురంకు చెందిన 31 ఏళ్ల సతీష్ మియాపూర్‌లో నివాసం ఉంటున్నారు.
సతీష్ గచ్చిబౌలిలోని ప్రముఖ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. సతీష్ ఏడాది క్రితం వివాహం అయింది. సతీష్ భార్య సంక్రాంతి పండుగకు ఏపీలోని వారి సొంతూరికి వెళ్లింది. అయితే ఆమె ప్రస్తుతం ఊరిలోనే ఉండగా… సతీష్ నిత్యం ఫోన్లో ఆమెతో మాట్లాడుతున్నారు.
అయితే గత కొంతకాలంగా సతీష్ తన ఉద్యోగంలో ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. తాను పనిచేస్తున్న సంస్థలో కోడింగ్ విధులు నిర్వర్తిస్తున్న సతీష్‌కు ఇటీవలి కాలంలో ఒత్తిడి పెరిగినట్టుగా తెలుస్తోంది.
సతీష్ ఇందుకు సంబంధించిన విషయాలను తన భార్యతో, తన సోదరుడితో కూడా షేర్ చేసుకున్నారు. అయితే బుధవారం రోజున మియాపూర్‌లోని తన ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
అయితే సతీశ్ ఏంతకీ గదిలో నుంచి బయటకు రాకపోవడంతో అతని తమ్ముడు తలుపులు పగులగొట్టాడు. లోపలికి వెళ్లేసరికి సతీశ్ చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు.
సతీశ్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే సతీష్ బలవన్మరణం చేసుకోవడానికి ఎక్కువ పని గంటలు కారణం కాదని పోలీసులు తెలిపారని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది



