
కులాంతర ప్రేమ వ్యవహారం..మాదాపూర్ లో యువకుడి దారుణ హత్య
ప్రేమ పేరుతో అక్కా చెల్లెళ్లను వేధింపులకు గురిచేసిన వ్యక్తి హత్య
ప్రేమ పేరుతో ఇద్దరి యువతులను వేధిస్తున్న వ్యక్తిని యువతుల కన్నతండ్రి హతమార్చాడు. ఈ ఘటన మాదాపూర్‌లో అర్ధరాత్రి చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే జరిగిన దారుణ హత్య కలకలం రేపింది. ఇద్దరు యువతులను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడనే కోపంతో.. వారి తండ్రి, బంధువు కలిసి ఓ యువకుడిని కత్తులతో నరికి చంపారు.
అనంతరం నిందితులిద్దరూ నేరుగా పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన సీనపల్లి భాస్కర్ (30) మాదాపూర్‌లోని ‘శ్రీ శ్రీనోమా’ హోటల్లో కుక్‌గా పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నాడు.
నిన్న అర్ధరాత్రి 11:45 గంటల సమయంలో మాదాపూర్ అరుణోదయ కాలనీలోని రామేశ్వరం కేఫే ఎదుట కనిపించిన భాస్కర్‌పై ఒక్కసారిగా కర్రలు, కత్తులతో దాడికి తెగబడ్డారు. తలతో పాటు శరీరంలోని పలు భాగాల్లో తీవ్ర గాయాలు కావడంతో భాస్కర్ రక్తపు మడుగులో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
వివాదానికి కారణం ఇదే…
మృతుడు భాస్కర్ వరంగల్‌కు చెందిన ఇద్దరు సోదరీమణులను ప్రేమ పేరుతో కొంతకాలంగా వెంబడిస్తూ, ఫోన్ సందేశాల ద్వారా వేధిస్తున్నట్లు యువతి తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ వేధింపులపై గతంలోనే వరంగల్ మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా నమోదైంది. పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినప్పటికీ భాస్కర్లో మార్పు రాలేదని, వేధింపులు కొనసాగించాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దమ్ముంటే హైదరాబాద్ రండి.. చూసుకుందాం! భాస్కర్ సవాల్ చేశాడు.
ఈ వేధింపుల విషయం తెలిసి యువతుల తండ్రి తమ్మెడబోయిన రాజు.. భాస్కర్‌కు ఫోన్ చేసి మందలించాడు. అయితే భాస్కర్ వెనక్కి తగ్గకుండా దమ్ముంటే రండి చూసుకుందాం అంటూ రాజుకు సవాల్ విసిరినట్లు పోలీసులు తెలిపారు. భాస్కర్ సవాల్‌తో ఆగ్రహానికి గురైన రాజు.. తన బావమరిది మారం కుమారస్వామితో కలిసి హైదరాబాద్‌కు చేరుకున్నాడు.
మాదాపూర్‌లోని రామేశ్వరం కేఫే సమీపంలో భాస్కర్‌ను అడ్డుకుని, వెంట తెచ్చుకున్న కత్తులు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చారు. సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరించారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు, దాడికి పాల్పడిన ప్రధాన నిందితులు తమ్మెడబోయిన రాజు, మారం కుమారస్వామి ఇద్దరూ స్వయంగా మాదాపూర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. ఈ ఘటనపై మాధాపూర్ పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




