
గురుకులమా? గిరిజాల కోటనా?.. ఎండలో ‘అల్లాడిన’ తల్లిదండ్రులు!
ఎండలో ‘అల్లాడిన’ తల్లిదండ్రులు.. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాల్సిన మహాత్మ జోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల (బాలికల – ఇంగ్లీష్ మీడియం) యాజమాన్యం మొండివైఖరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.పేరెంట్స్ మీటింగ్ పేరుతో పిలిపించి, గంటల తరబడి ఎండలో తల్లిదండ్రులను గేటు బయట నిలబెట్టడం పాఠశాల నిర్వాహకుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. నేడు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలకేంద్రంలోని గురుకుల పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేశారు. పాఠశాల ఆదేశాల మేరకు చాలా మంది తల్లిదండ్రులు ఉదయం 10 గంటలకే స్కూల్ వద్దకు చేరుకున్నారు.
అయితే, గేటు తీసి లోపలికి అనుమతించాల్సిన పాఠశాల సిబ్బంది, మధ్యాహ్నం గడుస్తున్నా గేట్లు తెరవకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
మండుటెండలో నిరీక్షణ: ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సుమారు 3-4 గంటల పాటు ముసలివారు, మహిళలు అని కూడా చూడకుండా ఎండలో బారులు తీర్చి నిలబెట్టారు.
కనీస సౌకర్యాల కరువు: గేటు బయట కనీసం తాగడానికి నీరు గానీ, కూర్చోవడానికి నీడ గానీ కల్పించకపోవడం యాజమాన్యం నిర్లక్ష్యానికి పరాకాష్ట.
నిరంకుశ వైఖరి: పేరెంట్స్ మీటింగ్ అంటే విద్యార్థుల ప్రగతి గురించి చర్చించడం, కానీ ఇక్కడ తల్లిదండ్రులను ఖైదీల వలె గేటు బయట ఉంచడం ఏ రకమైన సంస్కృతి అని తల్లితండ్రులు ప్రశ్నిస్తున్నారు. తల్లిదండ్రుల ఆవేదన: “మేము పనులు మానుకుని పిల్లల క్షేమం కోసం వస్తే, మమ్మల్ని మనుషులుగా కూడా చూడటం లేదు.
లోపల ఉన్న అధికారులు ఏసీ గదుల్లో కూర్చుని మమ్మల్ని ఎండలో ఎండుతుంటే చూసి ఆనందిస్తున్నారా?” అని ఒక విద్యార్థి తల్లి, తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి, తల్లిదండ్రుల పట్ల దురుసుగా ప్రవర్తించిన, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన పాఠశాల అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు జిల్లా కలెక్టర్ ను కోరుతున్నారు.



