
హరీశ్ రావుపై పోటీ చేస్తా.. జగ్గారెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
తెలంగాణలో సవాళ్ల రాజకీయం వేడెక్కింది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య డైలాగ్ వార్ ముదురుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్లు రాజకీయం సాగుతున్న వేళ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.వచ్చే ఎన్నికల్లో మాజీ మంత్రి హరీశ్ రావుపై పోటీ చేసేందుకు సిద్ధమేనని ప్రకటించారు. ఇవాళ మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన జగ్గారెడ్డి.. అధిష్టానం ఆదేశిస్తే హరీశ్ రావుపై పోటీ చేస్తానన్నారు.
వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డిలో తాను పోటీ చేయబోవడం లేదని చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. నేను సంగారెడ్డిలో మాత్రమే పోటీ చేయనన్నానని చెప్పానని కానీ వేరే చోట పోటీ చేయను అనలేదు కదా అన్నారు. నేను ఎక్కడ పోటీ చేయాలో పార్టీ నిర్ణయిస్తుందన్నారు.
సంగారెడ్డిలో నిర్మలనే అభ్యర్థి : వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గం రిజర్వేషన్ మహిళా, జనరల్ ఏది ఉన్నా కాంగ్రెస్ అభ్యర్థి తన సతీమణి నిర్మలా జగ్గారెడ్డినే అని స్పష్టం చేశారు. యాక్టివ్ లేని వాళ్ళని సీఎం రేవంత్ రెడ్డి అలెర్ట్ చేస్తున్నారని సీఎం సూచనలతో ఎమ్మెల్యేలు అలెర్ట్ అవుతున్నారని చెప్పారు.
సీఎం చెప్పిన తర్వాత కూడా తీరు మారకపోతే వేటు తప్పదని అలాంటి వారికి సీటు ఇవ్వాలో లేదో సీఎం, పీసీసీ చీఫ్, ఇంచార్జీ నిర్ణయం తీసుకుంటారన్నారు. అపోజిషన్ ఎప్పుడూ రూలింగ్ పార్టీని ఎటాక్ చేయడం అది రాజకీయ నీతిలో భాగం అన్నారు. కేసీఆర్ మొదటిసారి సీఎం అయినప్పుడు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని సర్వేలు చెప్పాయన్నారు.
రాజకీయాల్లో మేమే తోపులు అంటే నడవదని జగ్గారెడ్డి అన్నారు. పెద్ద పెద్ద తోపులను కూడా ప్రజలు పక్కన పెట్టిన సందర్భాలు ఉన్నాయని అందువల్ల సిట్టింగ్ ఎమ్మెల్యే తోపు కాదు సీఎం, పీసీసీ చీఫ్, ఇంచార్జీ మాత్రమే తోపులన్నారు. రాజకీయాల్లో పర్మినెంట్‍గా ఎవరూ తోపులు ఉండరన్నారు.




