
“పవన్ కళ్యాణ్ హఠావో.. పాలిటిక్స్ బచావో” పుస్తక రచయిత అనుమానాస్పద మృతి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో “పవన్ కళ్యాణ్ హఠావో.. పాలిటిక్స్ బచావో” పుస్తకం తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే.
కాగా శనివారం జరిగిన ఓ ప్రమాదంలో “పవన్ కళ్యాణ్ హఠావో.. పాలిటిక్స్ బచావో” పుస్తక రచయిత బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పదంగా మృతి చెందారు.
2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తూ ఈ పుస్తకం తీసుకువచ్చారు. పవన్ రాజకీయ ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ, ఆయన నిజమైన నాయకుడు కాదని, కేవలం రీల్ బెంగాల్ టైగర్ అని ఈ పుస్తకంలో విమర్శించారు.
అప్పట్లో ఈ పుస్తకం తీవ్ర చర్చకు తీయగా.. రచయిత అరెస్ట్ కు గురయ్యారు. అయితే ఈ రచయిత బొగ్గుల శ్రీనివాస్ నిన్న ఖమ్మంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో అనూహ్య మరణానికి గురయ్యారు.
మరణంపై అనుమానాలు.. శనివారం ఉదయం ఆయన ప్రయాణిస్తున్న కారు కూసుమంచి వద్ద పాలేరు రిజర్వాయర్ లోకి దూసుకువెళ్లడంతో.. వెనుక సీట్లో కూర్చున్న బొగ్గుల శ్రీనివాస్ నీటిలో మునిగి చనిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు.
అయితే డ్రైవర్ ప్రమాదం నుంచి తప్పించుకొని అక్కడి నుంచి పరారు కావడంతో ఆయన మరణంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.
పోలీసులు అనుమాస్పద మరణంగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
కాగా “పవన్ కళ్యాణ్ హఠావో.. పాలిటిక్స్ బచావో” పుస్తకం మాత్రమే కాకుండా.. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ రచనలపై శ్రీనివాస్ రాసిన అనేక వ్యాసాలను తెలంగాణ ప్రభుత్వం ప్రచురించింది.
బొగ్గుల శ్రీనివాస్ మరణం పట్ల ఆయన సన్నిహితులు, సహచర విద్యార్థులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఆయన మరణంపై దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.



