
పంచాయతీ కార్యదర్శి వేధింపులు.. మహిళా సర్పంచ్ ఆత్మహత్యాయత్నం
పాల్వంచ టౌన్ : ఓ పంచాయతీ కార్యదర్శి తన మాటలతో మనో వేదనకు గురి చేయడంతో పాటు వార్డు మెంబర్లతో ఫిర్యాదు చేయించి సర్పంచ్ పదవి నుంచి తొలగిస్తామంటూ బెదిరించడంతో మహిళా సర్పంచ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి..
పాల్వంచ మండలం సత్యనారాయణ పురం (మొండికట్ట) గ్రామ పంచాయతీ సర్పంచ్ జర్పుల సరితను కొంతకాలంగా పంచాయతీ కార్యదర్శి వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలిపారు.
గతంలో సర్పంచుల పదవీకాలం ముగియడంతో అప్పటినుండి ఇప్పటివరకు అధికారుల పాలనను కొనసాగించారు. ఆ సమయంలో వారిని అడిగే వారు ఎవరూ లేకపోవడంతో ఆడింది ఆట పాడింది పాటగా సాగింది.
సర్పంచులతో పాటు కొత్త పాలకవర్గం కొలువుదీరండంతో ఒక మహిళా సర్పంచ్ అని కూడా చూడకుండా ఎప్పుడు ఏదో ఒక విధంగా ఇబ్బందులకు గురి చేసేవారు.
మీకు బదులుగా మీ భర్త వచ్చి ఎందుకు మాట్లాడుతున్నాడని, ఇది ఇలానే కొనసాగితే వార్డు మెంబర్ లతో సంతకాలు చేయించి నీపై ఫిర్యాదు చేయిస్తానని నిన్ను సర్పంచ్ పదవి నుంచి తొలగిస్తామని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అదేవిధంగా ఉపాధి హామీ పథకంలో సర్పంచ్ కి సంబంధం లేకపోయినా కూలీలను ఎంపిక చేయాలని సర్పంచ్ తో ఎంపిక చేయించి తన కూలీలతో ఇదంతా చేశారంటూ గొడవలు సృష్టిస్తున్నారని అదే విధంగా సర్పంచ్ మానసికంగా వేధిస్తున్నారని ఆమె భర్త ఆరోపించారు.
పంచాయతీ కార్యదర్శి ఉద్దేశపూర్వకంగానే వేధింపులకు గురి చేయడంతో తన భార్య నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని సదరు పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలని ఆమె భర్త డిమాండ్ చేశారు.



