
‘భర్తల పెత్తనం వద్దు’.. మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు
గీసుకొండ: మహిళా సర్పంచ్‌ల భర్తలు పెత్తనం చేయొద్దని మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల సర్పంచ్, మున్సిపల్ చైర్ పర్సన్, కౌన్సిలర్‌లకి శిక్షణ కార్యక్రమంను మండలంలోని మరియాపురంలోని ఎస్ ఎస్ ఫంక్షన్ హాల్‌లో గురువారం కలెక్టర్ సత్య శారదా ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
అనంతరం ఆదర్శ గ్రామం గంగదేవిపల్లి మాజీ సర్పంచ్, సర్పంచ్ల ట్రైనింగ్ మేనేజర్ కూసం రాజమౌళి వారం మృతి చెందగా ఆయన ఆత్మ శాంతించాలని ఒక నిమిషం మౌనం పాటించి మాట్లాడారు. మహిళా సర్పంచ్లు ప్రోటోకాల్ విస్మరించకుండా జాగ్రత్త వహించాలి. జెనరల్ బాడీ మీటింగ్‌లలో టైం పాస్ చేయొద్దు.
అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించాలి. పార్టీలతో సంబంధం లేకుండా సమన్వయంతో గ్రామ అభివృద్ధికి కృషి చేయాలి. పదవి వచ్చిందని అహంకారానికి చరిత్ర హీనులు కావొద్దని ప్రజాప్రతినిధులను ఉద్దేశించి అన్నారు. గ్రామ పంచాయతీల్లో ప్లాస్టిక్ నిషేదించాలని తెలిపారు.
ఎంపీటీసీ స్థానం నుంచి వెనుదిరగకుండా మంత్రి స్థాయి వరకు ఎదిగానని గుర్తు చేశారు. ప్రజాప్రతినిధులు అంగన్వాడీ , స్కూల్‌లను అనునిత్యం పర్యవేక్షిస్తూ భోజన మెనూను పరిశీలించాలని సూచించారు.
వార్డు సభ్యులను విడదీసి పాలించవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సత్య శారద, ఈస్ట్ జోన్ డిసిపి అంకిత్ కుమార్, మేయర్ గుండు సుధారాణి, ఆర్డీవో సుమ, జెడ్పీసీవో రామ్ రెడ్డి, నర్సంపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీ లక్ష్మీ, వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ పాల్గొన్నారు.



