
ట్రాక్టర్‌తో ఢీకొట్టి ఎస్సైను హతమార్చే యత్నం
రెచ్చిపోతున్న ఇసుక అక్రమార్కులు..
అక్రమ ఇసుక తవ్వాకాలను అడ్డుకునే అధికారులపై హత్యాయత్నానికి పాల్పడుతున్న సంఘటన వికారాబాద్ జిల్లా, బషీరాబాద్ మండలం కేర్ అఫ్ అడ్రస్‌గా నిలుస్తుంది. గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన అధికారులు అక్రమార్కులతో చేతులు కలిపి వారికి సహకరించటంతో అక్రమర్జనకు అలవాటు పడిన అక్రమార్కులు అధికారులపై హత్యాయత్నాలకు వెనుకడటం లేదు.
మండల పరిధిలో దమర్చేడ్ గ్రామానికి చెందిన సురేష్, శీను కలిసి మండల పరిధిలోని ఎక్మాయి వాగు నుండి ఇసుక కోర్విచెడ్ గ్రామానికి తరలిస్తున్న క్రమంలో పెట్రోలింగ్‌లో ఉన్న బషీరాబాద్ ఎస్సై శ్రీశైలం యాదవ్ కంటపడ్డారు.
అక్రమార్కులను అడ్డుకునే ప్రయత్నం చేయగా.. ఇసుక లోడ్‌తో ఉన్న ట్రాక్టర్ పోలీస్ వాహనాన్ని బలంగా ఢీకొట్టి పరారయ్యారు. ఈ సంఘటన బషీరాబాద్ మండలం వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
అక్రమ ఇసుక రవాణాకు ఓ ఉద్యోగి అండదండలు.. ఐదు సంవత్సరాల క్రితం బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు బదిలీపై వచ్చిన ఒక హెడ్ కానిస్టేబుల్ కనుసన్నల్లో ఇదంతా కొనసాగుతుందని ఆరోపణలు ఉన్నాయి.
ఈ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ సైతం అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను అడ్డుకోబోవటంతో ట్రాక్టర్ డ్రైవర్ కానిస్టేబుల్ పై నుండి ట్రాక్టర్ తీసుకెళ్లటంతో రెండు కాళ్ళు విరిగిన ఘటన ఈ హెడ్ కానిస్టేబుల్ హయాంలోనే చోటుచేసుకుంది. ఒకే శాఖలో పనిచేస్తున్న తోటి ఉద్యోగులపై, అధికారులపై హత్య యత్నలకు పరోక్షంగా ఉసిగొలుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
నూతనంగా వచ్చిన ఎస్సైకు కొంతమంది ఫిర్యాదు చేయటంతో హెడ్ కానిస్టేబుల్ ఆటలు సాగకపోవటం వల్లే ఈ అఘాత్యానికి ఒడిగట్టినట్లు పలువురి నుండి బలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆయనకు తోడు మండలానికి చెందిన ఒక హోంగార్డ్ కూడా కూడా ఉన్నట్లు విశ్వాసనీయ సమాచారం. దీనిపై పోలీసు ఉన్నత అధికారులు వారిపై విచారణ జరిపి శాఖపరమైన చర్యలు తీసుకుంటారా? లేక వదిలేస్తారో చూడాలి.
ప్రజల ఆరోపణలు… చాలకాలంగా ఒకే పోలీస్ స్టేషన్ విధులు నిర్వహిస్తూ అక్రమార్కులకు వత్తాసు పలుకుతున్న హెడ్ కానిస్టేబుల్‌ను, హోమ్ గార్డ్‌ను ఇక్కడి నుండి వెంటనే బదిలీ చేయాలనీ పలువురు కోరుతున్నారు.
ఇటీవలే ఓ వ్యక్తిని చితకొట్టిన ఘటన సైతం వెలుగులోకి వచ్చినా.. అధికారులు ఇలాంటి వారిపై చర్యలు తీసుకోకపోవటంతో ఖాకి శాఖకే వన్నె తెచ్చేవిధంగా ఉందన్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు ఇలాంటి వారిపై గట్టిగా శాఖపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.



