
లివ్ఇన్ రిలేషన్ పేరుతో రూ.30 లక్షల మోసం
సహజీవనం చేస్తూ డబ్బులు ఇవ్వట్లేదని వేధింపులు..
ఖైరతాబాద్: రెండు సంవత్సరాల పాటు తనతో సహజీవనం చేసి డబ్బులు ఇవ్వకపోవడంతో ఓ వ్యక్తి వేధింపులకు పాల్పడుతున్నాడని మణికొండకు చెందిన బాధితురాలు (33) తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు.
ఓ ఇన్సూరెన్స్ కంపెనీలో మేనేజర్ విధులు నిర్వహిస్తున్నాని, తన కుమార్తెతో కలిసి మణికొండలో నివసిస్తున్నానని తెలిపారు.
2023 లో సూళ్లూరిపేటలోని ఓ దేవాలయానికి వెళ్లగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా గంటేడ మండలం పొల్లంకి గ్రామానికి చెందిన బొబ్మిలి సాయి కిరణ్ (31) అనే ప్రైవేట్ ఉద్యోగి పరిచయమయ్యాడని వెల్లడించారు.
డబ్బులు ఇవ్వడం ఆపడంతో బెదిరింపులు స్టార్ట్.. కొంత కాలం అక్కడే సహజీవనం చేశామని, సాయికిరణ్‌కు హైదరాబాద్ బదిలీ కావడంతో తాను నివాసం ఉంటున్న మణికొండలోనే సహజీవనం సాగిస్తున్నామన్నారు.
ఇప్పటి వరకు పలు ఖర్చుల కోసం తన వద్ద నుంచి రూ. 30లక్షల వరకు తీసుకున్నాడని పేర్కొన్నారు. గత సంవత్సరం ఆ డబ్బులు ఇవ్వడాన్ని ఆపడంతో వేధింపులను ప్రారంభించాడని తెలిపారు.
గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో మణికొండలో తనపై దాడి చేశాడని, చంపుతానని బెదిరించాడని అన్నారు. ఈ విషయంపై నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే అతన్ని ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదన్నారు.
పోలీసులు తన కేసును తారుమారు చేసేందుకు సాయికిరణ్‌తో కలిసి కుట్రజేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, సీపీలు స్పందించి, తనకు న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై నార్సింగి సీఐ హరికృష్ణారెడ్డిని వివరణ కోరగా, కేసు ప్రస్తుతం కోర్టులో ఉందని, ఛార్జ్ షీట్ వేశామని తెలిపారు.



