BhadrachalamEducationHealthPoliticalTelangana

బాలుర వసతి గృహాల నిర్వహణలో నిర్లక్ష్యం

బాలుర వసతి గృహాల నిర్వహణలో నిర్లక్ష్యం

బాలుర వసతి గృహాల నిర్వహణలో నిర్లక్ష్యం

ఇల్లెందులో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

ఇద్దరు వార్డెన్ల సస్పెన్షన్‌కు జిల్లా కలెక్టర్ ఆదేశం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం విస్తృత పర్యటన నిర్వహిస్తూ ప్రభుత్వ ఆసుపత్రి, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలు మరియు పలు వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్య సేవలు, విద్యార్థుల సంక్షేమం, ఆహార నాణ్యత, పరిశుభ్రత, మౌలిక సదుపాయాలపై సమగ్రంగా పరిశీలించి లోపాలు ఉన్న చోట్ల కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

మొదటగా ఇల్లందు వైద్య విధాన పరిషత్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్, ఆసుపత్రి నిర్వహణ, వైద్య సేవలు, మౌలిక సదుపాయాలను సమీక్షించారు. ఆసుపత్రి ఎదుట ప్రైవేట్ అంబులెన్స్ నిలిపి ఉంచడం గమనించి దాని అనుమతులు, అవసరంపై అధికారులను ప్రశ్నించారు.

ఆసుపత్రి ప్రాంగణంలో ప్రైవేట్ కార్యకలాపాలు నిర్వహించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ తగిన వివరణ ఇవ్వాలని ఆర్‌ఎంఓను ఆదేశించారు. ఇన్‌పేషెంట్ విభాగాన్ని పరిశీలించిన కలెక్టర్ రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు.

డయాలసిస్ కేంద్రాన్ని తనిఖీ చేసి కేసుల సంఖ్య, సేవల నాణ్యతపై ఆరా తీశారు. ఈ ప్రాంతంలో డయాలసిస్ కేసులు అధికంగా నమోదవుతున్న కారణాలను అధ్యయనం చేయాలని సూచించారు. వైద్యులు, సిబ్బంది హాజరు నమోదు పుస్తకాలను పరిశీలించి విధుల్లో నిర్లక్ష్యం ఉండకూడదని హెచ్చరించారు. ఆసుపత్రికి అవసరమైన అంబులెన్స్ సౌకర్యం కల్పించాలని సూచించారు.

ఈ సందర్భంగా ఒక బాధితుడు అందజేసిన వినతి పత్రంపై స్పందించిన కలెక్టర్, అత్యవసర సమయంలో ప్రైవేట్ అంబులెన్స్ నిర్లక్ష్యం వహించడం వల్ల రోగి మృతి చెందిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. అత్యవసర సేవల్లో ఎటువంటి లోపాలు సహించబోమని స్పష్టం చేశారు.

అనంతరం ఇల్లందు ట్రైబల్ వెల్ఫేర్ ఎస్టీ బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేసిన కలెక్టర్, వంటశాలలో సిద్ధం చేస్తున్న ఆహార నాణ్యతను పరిశీలించారు. మెనూ ప్రకారం ఆహారం అందించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ విద్యార్థుల పోషణలో నిర్లక్ష్యం అస్సలు సహించబోమని హెచ్చరించారు.

స్టోర్‌రూమ్‌ను పరిశీలించి సరుకుల నాణ్యత, నిల్వ విధానాలపై సూచనలు చేశారు. విద్యార్థులతో మాట్లాడి భవనం మరమ్మతులు, ఫ్యాన్లు, తాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలలో కూడా తనిఖీ నిర్వహించిన కలెక్టర్, భోజనం సమయంపై సిబ్బంది సరైన సమాచారం ఇవ్వకపోవడం, మెనూ పాటించకపోవడం, పరిశుభ్రత లోపాలను గమనించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం చూపినందుకు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన వార్డెన్ భరత్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఆదేశించారు.

ఇల్లందు షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ బాలుర వసతి గృహాన్ని పరిశీలించిన సమయంలో వార్డెన్, సిబ్బంది ఎవరూ లేని పరిస్థితిని గమనించిన కలెక్టర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించడంతో సంబంధిత వార్డెన్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించారు.

వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేసిన కలెక్టర్, నిర్ణీత సమయానికి భోజనం సిద్ధం కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సిబ్బందిని హెచ్చరించారు. విద్యార్థులకు సమయానికి నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించడం తప్పనిసరి బాధ్యత అని స్పష్టం చేశారు.

వసతి గృహాల నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించిన ఇద్దరు వార్డెన్లను సస్పెండ్ చేయాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ అంకిత్, విద్యార్థుల సంక్షేమం, ఆరోగ్యం, భద్రత విషయంలో అధికారులు అత్యంత బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. విద్య, వైద్యం, సంక్షేమ రంగాల్లో ఎటువంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ హర్షవర్ధన్, ఆర్‌ఎంఓ రామ్ నివాస్, డ్యూటీ డాక్టర్ ప్రత్యూషతో పాటు సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button