EducationPoliticalTelanganaWarangal

వరంగల్ KMCలో ర్యాగింగ్ కలకలం

వరంగల్ KMCలో ర్యాగింగ్ కలకలం

వరంగల్ KMCలో ర్యాగింగ్ కలకలం

వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ(KMC)లో ర్యాగింగ్ కలకలం రేగింది. జూనియర్లను మోకాళ్లపై కూర్చోబెట్టి వేధించిన ఏడుగురు MBBS విద్యార్థులపై ప్రిన్సిపాల్ సంధ్యారాణి వేటు వేశారు. సెకండియర్ విద్యార్థులు తమ వాట్సాప్ గ్రూపుల్లో సీనియర్ల గురించి అనుచితంగా పోస్టులు పెట్టారనే నెపంతో ఈ గొడవ మొదలైంది.

తమను కించపరిచేలా వ్యవహరించిన జూనియర్లకు ‘బుద్ధి చెప్పాలని’ భావించిన సుమారు ఏడుగురు సీనియర్లు, దాదాపు 20 మంది జూనియర్లను హాస్టల్ టెర్రస్‌పైకి తీసుకెళ్లారు. అక్కడ వారిని గంటల తరబడి మోకాళ్లపై కూర్చోబెట్టి, అవమానకర రీతిలో క్షమాపణలు చెప్పించుకోవడం తీవ్ర కలకలం రేపింది.

అధికారుల రంగప్రవేశం : సీనియర్ల వేధింపులను అవమానంగా భావించిన బాధిత విద్యార్థులు మిన్నకుండిపోలేదు. వారు ఏకంగా నేషనల్ మెడికల్ కౌన్సిల్ కి ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేయడంతో పాటు, వరంగల్ పోలీస్ కమిషనర్‌ను కూడా ఆశ్రయించారు.

విషయం తీవ్రతను గమనించిన కళాశాల యాజమాన్యం వెంటనే అప్రమత్తమైంది. కళాశాల యాంటీ ర్యాగింగ్ కమిటీ అత్యవసరంగా సమావేశమై, బాధిత విద్యార్థుల నుంచి స్టేట్‌మెంట్లను రికార్డు చేసింది.

ఈ విచారణలో సీనియర్లు తమ అధికారాన్ని ప్రదర్శిస్తూ జూనియర్లను శారీరకంగా, మానసిక ఇబ్బందులకు గురిచేసినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. విద్యాసంస్థల్లో ఇలాంటి అనాగరిక చర్యలు ఎంతమాత్రం సహించబోమని కమిటీ సభ్యులు స్పష్టం చేశారు.

ఏడుగురు సీనియర్లపై వేటు : విచారణా నివేదిక ఆధారంగా కళాశాల అధికారులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. ర్యాగింగ్‌కు పాల్పడినట్లు తేలిన ఏడుగురు సీనియర్ విద్యార్థులపై వేటు వేశారు. వారిని ఆరు నెలల పాటు కళాశాల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

గతంలో కూడా కేఎంసీలో ఇలాంటి ఘటనలు జరిగి విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతిన్న దాఖలాలు ఉన్నప్పటికీ, సీనియర్లలో మార్పు రాకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ సస్పెన్షన్ వేటు ద్వారా ర్యాగింగ్‌కు పాల్పడితే ఎంతటి వారైనా శిక్ష తప్పదని అధికారులు ఇతర విద్యార్థులకు గట్టి సందేశాన్ని పంపారు. ప్రస్తుతం ఈ ఘటనతో క్యాంపస్‌లో భారీ భద్రతతో పాటు కౌన్సెలింగ్ చర్యలు చేపడుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button