
విద్యార్థుల సృజనాత్మకతకు ప్రోత్సాహం
క్రమశిక్షణతోనే ఉన్నత లక్ష్యాలు సాధ్యం: ఎస్సై సంధ్య
విద్యతోపాటు కలలోను రాణించాలని విద్యార్థులకు సూచన
CK న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు మే 12 2026: 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాల సందర్భంగా ఖమ్మం జిల్లా ఏన్కూరులోని TGRS & JC లో విద్యార్థులలోని సృజనాత్మక ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో ఆర్ట్, క్రాఫ్ట్ మరియు సాంస్కృతిక పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. చిత్రలేఖనం, చేతిపనులు, నృత్యాలు, గాన ప్రదర్శనలు తదితర విభాగాలలో విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. విద్యార్థులు రూపొందించిన కళాఖండాలు, క్రాఫ్ట్ నమూనాలు సభికులను ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏన్కూరు పోలీస్ స్టేషన్ సబ్‌ఇన్‌స్పెక్టర్ ఎన్ సంధ్య మాట్లాడుతూ విద్యార్థి దశలోనే కళలు, సంస్కృతి, సృజనాత్మక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెంపొందించుకోవడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. విద్యతో పాటు సాంస్కృతిక, కళారంగాలలోనూ రాణించడం ద్వారా వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుందని తెలిపారు. క్రమశిక్షణ, పట్టుదల, కృషితో ముందుకు సాగితే ఉన్నత లక్ష్యాలను సాధించవచ్చని విద్యార్థులకు సూచించారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు దోహదపడతాయని అన్నారు.అనంతరం పోటీలలో ప్రతిభ కనబరిచిన విజేతలకు ముఖ్య అతిథి చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. విజేతలను అధ్యాపకులు, తల్లిదండ్రులు అభినందించారు. విద్యార్థుల కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని నిర్వాహకులు పేర్కొన్నారు.



