
భర్త ఇంటి ముందు బాబుతో భార్య ధర్నా
Hyderabad: ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. యువకుడి తల్లిదండ్రులు పెండ్లికి ఒప్పుకోకపోవడంతో పెద్దలను ఎదిరించి ఇష్ట పడిన యువతిని పెండ్లి చేసుకున్నాడు. హైదరాబాద్‌లో కాపురం పెట్టాడు.
వీరి ప్రేమకు గుర్తుగా ఒక కుమారుడు జన్మించాడు. ఏమైందో తెలియదు కానీ ఇప్పుడు ఆ యువకుడు యువతికి ముఖం చాటేయడంతో.. ఆ యువతి భర్త ఇంటి ముందు నాలుగు రోజులుగా నిరసన తెలుపుతున్న సంఘటన సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాతూరు గ్రామంలో చోటు చేసుకుంది.
బాధిత మహిళ గౌరి తెలిపిన వివరాల ప్రకారం.. గజ్వేల్ మండలం కోమటి బండ గ్రామానికి చెందిన కన్నుముత్తుల గౌరి గజ్వేల్ లో బ్యాంగిల్స్ స్టోర్‌లో వర్కర్‌గా విధులు నిర్వహిస్తుండేది. ఈ క్రమంలో పాతూరు గ్రామానికి చెందిన సిగ్గిరెడ్డి అభిలాష్ రెడ్డి ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు.
పెండ్లికి యువతి తల్లిదండ్రులు ఒప్పుకోగా, యువకుడి తల్లిదండ్రులు నిరాకరించారు. పెద్దలను ఎదిరించి యాదగిరి గుట్ట దేవస్థానంలో 2023లో పెండ్లి చేసుకున్నారు. అనంతరం గౌరి, అభిలాష్ రెడ్డిలు రామంతపూర్‌లో నివాసం ఉంటూ ఓ చిన్న ఉద్యోగం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు.
ఈ క్రమంలో గౌరి కుమారుడికి జన్మనిచ్చింది. బాలుడికి 9 నెలలు. అభిలాష్ రెడ్డి తండ్రి సంతోష్ రెడ్డి, తల్లి శ్యామలు 2 నెలల క్రితం కుమారుడు కనబడటం లేదని గజ్వేల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు అభిలాష్ రెడ్డిని పోలీసులు పిలిపించారు. బాలుడికి అనారోగ్య కారణాలతో గౌరి కోమటి బండ గ్రామంలోని తల్లి గారి ఇంటికి వెళ్లింది. ఏమైందో తెలియదు కాని అప్పటి నుంచి గౌరికి అభిలాష్ రెడ్డి ముఖం చాటేశాడు.
గౌరి పెద్ద మనుషులను ఆశ్రయించగా ఇరువురి పెద్దల సమక్షంలో గౌరి, అభిలాష్ రెడ్డిలను గజ్వేల్ పట్టణంలోని ఓ అద్దె ఇంట్లో ఉంచారు. అభిలాష్ రెడ్డి గౌరిని వదిలి వేసి పాతూరు గ్రామంలో తల్లిదండ్రుల వద్ద ఉంటున్నాడు.
గౌరి అభిలాష్ రెడ్డికి ఫోన్ చేసిన స్పందించకుండా దళితులమని కులం పేరిట దూషిస్తున్నట్లు వెల్లడించింది. విసుగు చెందిన కన్నముత్తుల గౌరి పాతూరు గ్రామంలోని భర్త ఇంటి ఎదుట 9 నెలల బాలుడితో నిరసనకు దిగింది.
దీంతో అభిలాష్ రెడ్డి కుటుంబం ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోయారు. భర్త ఇంటి ఎదుట నాలుగు రోజులుగా గౌరి నిరసన తెలుపుతుంది. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తానని గౌరి స్పష్టం చేసింది.




